హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి దర్శనం డిసెంబర్ నెలకు సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలను శనివారం వెల్లడించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవకు సంబంధించిన కోటాను ఈనెల 19న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని సూచించింది.
22న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఉదయం 10గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది. 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు , 11 గంటలకు శ్రీవాణి దర్శన కోటాను విడుదల చేస్తామని తెలిపింది. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను రిలీజ్ చేస్తామని వెల్లడించింది. 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను విడుదల చేస్తామని పేరొన్నారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.