Tollywood | సాధారణంగా ప్రతి వారం రెండు, మూడు సినిమాలు థియేటర్లలోకి రావడం సహజం. కొన్ని వారాల్లో నాలుగైదు చిత్రాలు విడుదలైనా అది పెద్ద విషయంగా అనిపించదు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. అక్టోబర్ 1, 2 తేదీల్లో కలిపి దాదాపు పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే ఇన్ని చిత్రాలు విడుదలవుతున్నప్పటికీ.. వాటిలో చాలా సినిమాల గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవడం గమనార్హం. ప్రమోషన్ల విషయంలోనూ పలువురు హీరోలు, చిత్రబృందాలు వెనుకబడినట్టే కనిపిస్తున్నాయి.
మలయాళ స్టార్ నివిన్ పౌలి, తమిళ నటుడు సూరి కలిసి నటించిన చిత్రం ‘సంచారి’. మలయాళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి అక్టోబర్ 1న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు మాత్రం ఇప్పటివరకు పెద్దగా ప్రమోషన్స్ కనిపించలేదు.
ఆది సాయికుమార్ ఇటీవల ‘శంబాలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుని ఫామ్‌లోకి వచ్చారు. ఆయన హీరోగా నటించిన ‘సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్’ అక్టోబర్ 2న విడుదల కానుంది. అయితే సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతున్నా.. పెద్దగా ప్రచారం జరగడం లేదు. దీంతో ఈ సినిమా విడుదలవుతున్న విషయం చాలామంది ప్రేక్షకులకు తెలియని పరిస్థితి నెలకొంది.
సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు దర్శకత్వం వహించిన చిత్రంగా ఈ సినిమాపై కొంత ఆసక్తి ఏర్పడింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేస్తున్నారు. మిగతా చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాకు కొంత బజ్ కనిపిస్తోంది.
ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కూడా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించారు. విడుదలకు ముందు ఈ సినిమాపై పెద్దగా చర్చ లేకపోయినా.. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడంతో ఒక్కసారిగా సినిమాపై ఆసక్తి పెరిగింది.
దినేష్ తేజ్, దశ్విక జంటగా నటించిన థ్రిల్లర్ చిత్రం ‘తత్త్వం’ కూడా అక్టోబర్ 2న విడుదలవుతోంది. సినిమాపై ఇప్పటివరకు భారీ అంచనాలు లేకపోయినా.. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మాత్రం మంచి స్పందన వచ్చింది. థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రం థియేటర్లలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
‘కోర్ట్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్, కొత్త నటి నక్షత్ర జంటగా నటించిన చిత్రం ‘తెల్లకాగితం’. ఇంటర్ విద్యార్థుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా అక్టోబర్ 2నే విడుదల కానుంది. సినిమాలోని పాటలకు కొంత స్పందన వచ్చినప్పటికీ.. సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ రాలేదు. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన ఓ రొమాంటిక్ సన్నివేశం బయటకు రావడం చర్చకు దారితీసింది.
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘డోరతీ’ కూడా ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎల్జీబీటీక్యూ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా తమిళనాడులో విడుదల సమయంలో వివాదాలను ఎదుర్కొంది. ఇప్పుడు తెలుగులో విడుదలవుతున్నప్పటికీ.. ఇక్కడ పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడం సినిమాపై ఆసక్తిని పరిమితం చేస్తోంది.
సంధ్య, విక్రమ్ సహిదేవ్ జంటగా నటించిన ‘అనకాపల్లి’ సినిమా కూడా అక్టోబర్ 2న విడుదల కానుంది. త్రినాథ్ రావు నక్కిన నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా గతంలో విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో కేవలం అనకాపల్లిలో మాత్రమే ప్రదర్శించి, ఇతర ప్రాంతాల్లో విడుదలను నిలిపివేశారు. ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.
కన్నడలో విజయం సాధించిన ‘ప్రేమనే ఊరిలో’ సినిమాను కూడా తెలుగులోకి తీసుకొచ్చి అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు. అయితే కన్నడలో సక్సెస్ అయినప్పటికీ.. తెలుగు వెర్షన్‌కు మాత్రం ఇప్పటివరకు పెద్దగా ప్రచారం దక్కలేదు.
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ కూడా అక్టోబర్ 2న విడుదల కానుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో హిందీ వెర్షన్‌ను ప్రదర్శించనున్నారు. ఈ సినిమాకు ఇతర చిత్రాలతో పోలిస్తే ఇప్పటికే ఉన్న ఫ్రాంచైజీ కారణంగా ప్రేక్షకుల్లో కొంత పరిచయం ఉంది.
మొత్తంగా అక్టోబర్ 1, 2 తేదీల్లో దాదాపు పది సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలు లేని ఈ వారంలో.. కొన్ని చిత్రాలకు మాత్రమే చెప్పుకోదగ్గ బజ్ కనిపిస్తోంది. మరికొన్ని సినిమాలు కనీస ప్రచారం లేకుండానే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే సినిమా బాగుంటే ప్రచారంతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరించే అవకాశమూ ఉంటుంది. అందుకే ఈ పది చిత్రాల్లో ఏ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందో, బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రం నిలబడుతుందో చూడాలి.