ఖమ్మం కమాన్‌బజార్, సెప్టెంబర్ 15: విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఖమ్మం నగరంలో సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కశాశాల నుంచి ఐటీ హబ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇల్లెందు క్రాస్‌రోడ్డు వద్ద నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తుండు ప్రవీణ్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేశ్‌లు మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రాష్ట్రవ్యాప్తంగా రూ.8,150 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని మండిపడ్డారు. తక్షణమే బకాయిలను విడుదల చేయాలని, లేదంటే ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు జార్జిరెడ్డి, లక్ష్మణ్, లోకేష్, వినయ్ పాల్గొన్నారు.