Talasani srinivas Yadav | ఎంతో గణ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును, అస్థిత్వాన్ని దెబ్బ తీయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డ సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 17న 10 వేల మందితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలు, జెండాలతో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని కూడా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన ఉదయం 10 గంటలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్ పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సనత్ నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ బోర్డు సభ్యులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం తలసాని మీడియాతో మాట్లాడనున్నారు.
అన్ని వర్గాల ప్రజలు కలిసి ఎంతో ప్రశాంతంగా ఉండే సికింద్రాబాద్ ప్రాంతాన్నిముక్కలు చేస్తామంటే.. చూస్తూ ఊరుకోమని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే వరకు పోరాటాన్ని ఆపేది లేదని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతామన్నారు.