సిమ్లా: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఐఏ ఇంపాక్ట్ సమ్మిట్‌లో చొక్కాలు లేకుండా నిరసన తెలిపిన ముగ్గురు యువజన కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్‌లో హైడ్రామా జరిగింది. ఢిల్లీ, సిమ్లా పోలీసుల మధ్య రోజంతా ఘర్షణ, కేసు నమోదుకు దారితీసింది. కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్‌లో నిందితులైన ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలుసుకున్నారు. దీంతో బుధవారం ఉదయం 5 గంటలకు నాలుగు వాహనాల్లో సిమ్లా జిల్లాకు చేరుకున్నారు. మాండ్లి ప్రాంతంలోని ఒక రిసార్ట్‌పై ఢిల్లీ పోలీసులు రైడ్ చేశారు. అక్కడ బస చేసిన ముగ్గురు యువ కాంగ్రెస్ కార్యకర్తలు సౌరభ్ సింగ్, అర్బాజ్ ఖాన్, సిద్ధార్థ్ అవధూత్ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి డీవీఆర్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, కాంగ్రెస్ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న హిమాచల్ ప్రదేశ్ పోలీసులు రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో మూడు వేర్వేరు చోట్ల ఢిల్లీ పోలీస్ వాహనాలను సిమ్లా పోలీసులు అడ్డుకున్నారు. సివిల్ డ్రెస్‌లో ఉన్న ఢిల్లీ పోలీసులను మూడు గంటల పాటు నిర్బంధించారు. వారిని స్థానిక కోర్టుకు తరలించారు. అయితే సిమ్లా పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరుపలేదు.
మరోవైపు బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో అరెస్ట్ చేసిన నిందితులతో పాటు ఢిల్లీ పోలీసులు తమ వాహనాల్లో వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కోర్టు బయట సిమ్లా పోలీసులు వారిని అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులు కోర్టు వద్దకు చేరడంతో చివరకు రాత్రి సమయంలో ఢిల్లీ పోలీసులను వెళ్లనిచ్చారు.
అయితే బుధవారం రాత్రి 8 గంటల సమయంలో రిసార్ట్ యజమాని ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులపై కిడ్నాప్ కేసును సిమ్లా పోలీసులు నమోదు చేశారు. దీంతో షోఘి సమీపంలో ఢిల్లీ పోలీసులను మళ్లీ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై ఇరు పోలీస్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ పొందకుండా నిందితులను రాష్ట్రం నుంచి బయటకు తీసుకెళ్లకూడదని సిమ్లా పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
దీంతో బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో నిందితులను వైద్య పరీక్షల కోసం రిపోన్ ఆసుపత్రికి ఢిల్లీ పోలీసులు తరలించారు. గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఏకాంష్ కపిల్ నివాసానికి నిందితులను తరలించి ట్రాన్సిట్ రిమాండ్ పొందారు. ఆ తర్వాత నిందితులను సిమ్లా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
మరోవైపు సిమ్లా పోలీస్ స్టేషన్ వద్ద మరోసారి ఇరు పోలీసుల మధ్య హైడ్రామా జరిగింది. స్వాధీనం చేసుకున్న డీవీఆర్‌ను తమకు అప్పగించాలని సిమ్లా పోలీసులు డిమాండ్ చేశారు. లేకపోతే స్వాధీనం చేసుకున్న పరికరాలు ఉన్న వాహనాన్ని సీజ్ చేస్తామని బెదిరించారు. దీంతో ఇరు పోలీస్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది.
అయితే గురువారం తెల్లవారుజామున సిమ్లా నగరంలోని కన్లోగ్లో ఢిల్లీ పోలీస్ బృందాన్ని సిమ్లా పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ కేసు నమోదు కావడంతో కొంతమంది పోలీసులను సిమ్లాలో ఉంచాలని, మిగతా వారు నిందితులను ఢిల్లీకి తీసుకువెళ్లవచ్చని చెప్పారు. స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాల కాపీ అందజేయాలని డిమాండ్ చేశారు. తమ సిబ్బంది ఎవరూ ఇక్కడ ఉండబోరని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. వాగ్వాదం తర్వాత తమ వాహనాల్లో అక్కడి నుంచి బయలుదేరారు.
కాగా, గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో షోఘి సరిహద్దు వద్ద ఢిల్లీ పోలీస్ బృందాన్ని సిమ్లా పోలీసులు మళ్ళీ అడ్డుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలు ఉన్న వాహనాన్ని బారికేడ్లతో దిగ్బంధించారు. ఆ వాహనం కీ అడగ్గా ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు నిరాకరించారు. సీజ్ మెమో, సంబంధిత పత్రాలను మేజిస్ట్రేట్‌కు చూపించామని, దాని ఆధారంగా 18 గంటల ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే ఐదు గంటలు గడిచిపోయినట్లు వివరించారు.
చివరకు సీజ్ మెమో కాపీని ఢిల్లీ పోలీసులు సిమ్లా పోలీసులకు అందజేయడంతో ఈ ప్రతిష్టంభన ముగిసింది. దీంతో గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ పోలీసు బృందం నిందితులతో బయలుదేరింది. ఢిల్లీ చేరుకున్న తర్వాత అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచనున్నారు. అయితే యువజన కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీ, సిమ్లా పోలీసుల మధ్య ఒక రోజంతా ఘర్షణ వాతావరణంతో హైడ్రామా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
VIDEO | Shimla: A jurisdiction dispute has erupted after the Delhi Police detained three Youth Congress workers in connection with an AI Summit protest pic.twitter.com/H7o7eaYOb8
— Press Trust of India (@PTI_News) February 25, 2026
Also Read:
Veena George injured | కాంగ్రెస్ విద్యార్థి విభాగం నిరసన, దాడి.. కేరళ మంత్రికి గాయాలు
Meghalaya tops HIV Cases | హెచ్ఐవీ కేసుల్లో టాప్‌లో మేఘాలయ.. 10,000 మందికిపైగా రోగులు
Dog Carries Human Leg | ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. తెగిన కాలును నోట కరుచుకుని తిరిగిన కుక్క