పర్ణశాల, సెప్టెంబర్ 5: మూడు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు భద్రాద్రి జిల్లాలో శుక్రవారం ధర్నా చేశారు. ఈ మేరకు దుమ్ముగూడెం మండలం పర్ణశాల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబాలు గడవక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
విధులకు రావాలన్నా వాహనంలో పెట్రోలు పోయించుకునేందుకు కూడా డబ్బుల్లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని అన్నారు. అందువల్ల శుక్రవారం నుంచి తమకు జీతాలు ఇచ్చేంత వరకు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ ధర్నాలో మిషన్ భగీరథ కార్మికులు సోమరాజు, వంశీ, శ్రీను, సందీప్, నగేశ్, రామకృష్ణ, కల్యాణ్, వంశీకృష్ణ, వెంకటేశ్వర్లు, సురేశ్, రామకృష్ణ, ప్రవీణ్, రమేశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.