అశ్వారావుపేట, సెప్టెంబర్ 5: పది పరీక్షల నిర్వహణపై సర్కారు తీసుకున్న నిర్ణయం విద్యాశాఖలో గందరగోళ పరిస్థితులకు దారి తీసింది. నిరుడు పది పరీక్షల్లో మార్పులు చేయనున్నట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులకు కూడా శిక్షణనిచ్చింది. తీరా ఈ ఏడాది ప్రారంభమై మూడు నెలలు గడిచినా కొత్త ప్రశ్నపత్రం నమూనా విడుదల చేయకుండా తాత్సారం చేసింది. చివరికి ఎన్సీఈఆర్టీ మొట్టికాయలు వేయడంతో కొత్త విధానంలో పరీక్షల నిర్వహణకు వెనుకడుగు వేసింది. మళ్లీ పాత పద్ధతిలోనే పది పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇటీవల సర్క్యులర్ విడుదల చేసింది. అయితే, అప్పటికే కొత్త పద్ధతి ప్రకారం బోధన చేస్తున్న ఉపాధ్యాయులు.. ప్రభుత్వం మళ్లీ పాత పద్ధతే అంటుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 320 పాఠశాలల్లో 13,912 మంది టెన్త్ విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహణపై పాత పద్ధతిని రద్దు చేసి కొత్త పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తామని గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది. 2024 నవంబర్‌లో వార్షిక పరీక్షల్లో గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయడమే కాకుండా ఇంటర్నల్స్‌ను సైతం ఎత్తివేసింది. మొత్తం 100 మార్కులకు పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని సర్కార్ గొప్పగా ప్రచారం చేసుకుంది. ఈ కొత్త పరీక్షా విధానాన్ని 2025-26 విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తామని ఉత్తర్యులు జారీ చేసింది. దానికి అనుగుణంగానే విద్యార్థులకు ఉపాధ్యాయుల బోధన సాగుతోంది. ఈ ఏడాది పాఠశాలలు పునఃప్రారంభమై 3 నెలల సమయం గడిచిపోయింది కూడా. ఇంతలోనే మళ్లీ పాత పద్ధతిలోనే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామంటూ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం ప్రకటించింది. దీనిపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆగస్టు రెండో వారంలో ఉత్తర్యులు జారీ చేశారు.
టెన్త్‌లో ఇంటర్నల్ మార్కులను రద్దు చేయడంపై జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో 20 శాతం ఇంటర్నల్స్, 80 శాతం సబ్జెక్టుల మార్కులను వార్షిక పరీక్షలకు కేటాయిస్తోందని, కానీ తెలంగాణలో ఇంటర్నల్ మార్కులను ఎలా రద్దు చేస్తారని వర్క్‌షాపులో ఎన్సీఈఆర్టీ ప్రశ్నించింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖాధికారులు పునరాలోచనలో పడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తన తప్పును గుర్తించించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇంటర్నల్ మార్కులను కొనసాగిస్తూ మళ్లీ పాత పద్ధతిలోనే టెన్త్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
టెన్త్ పరీక్షలను కొత్త పద్ధతిలో నిర్వహిస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్సీఈఆర్టీ మొట్టికాయలు వేయడాన్ని, పాఠశాలల యాజమాన్యాల నుంచి వ్యతిరేకత రావడాన్ని గుర్తించిన ప్రభుత్వం.. తన నిర్ణయంపై యూటర్న్ తీసుకుంది. ఈ ఏడాది ఇంటర్నల్స్ కొనసాగించాలని నిర్ణయించింది.
భద్రాద్రి జిల్లాలోని 320 పాఠశాలల్లో 13,912 మంది విద్యార్ధులు టెన్త్ చదువుతున్నారు. గత ఏడాది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారితో ఉపాధ్యాయులు ఇప్పటి వరకు రికార్డులను రాయించలేదు. అయితే, ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ నిర్ణయాన్ని మార్చుకోవడంతో విద్యార్థులతో రికార్డులు రాయించడం తమ తలకు మించిన భారమని ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. కొత్త పరీక్షా విధానంపై గత వేసవి సెలవుల్లో ప్రభుత్వం ఇచ్చిన శిక్షణ కూడా వృథా అయినట్లు విమర్శలు చేస్తున్నారు.