సిటీబ్యూరో, మార్చ్ 12(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి నెలలో మొత్తం 78 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని సిటీ క్రైమ్స్ అడిషనల్ సీపీ శ్రీనివాసులు తెలిపారు. పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ ఆక్టోపస్ ప్రత్యేక ఆపరేషన్‌లో సిటీ లా అండ్ ఆర్డర్ బృందాలతో కలిసి సైబర్ పోలీసులు దేశవ్యాప్తంగా మొత్తం 16 రాష్ర్టాల్లో 117 మంది నిందితులను అరెస్ట్ చేశారని తెలిపారు. అరెస్టయిన వ్యక్తులకు దేశవ్యాప్తంగా 1081 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని, వీరి బ్యాంక్ ఖాతాల్లో సుమారు రూ.139 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు రికార్డయిందని తెలిపారు. వీరందరికీ సైబర్ పీఎస్‌లో నమోదైన 74 కేసులతో సంబంధం ఉందని, ఇందులో ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు 63, డిజిటల్ అరెస్ట్‌లు 6, ఓటీపీ మోసాలు 4, సోషల్‌మీడియా నేరాలు 1 గా గుర్తించామని చెప్పారు.
ఫిబ్రవరిలో జోనల్ సైబర్సెల్స్కు 2,963 ఎన్సీఆర్పీ పిటిషన్లు అందగా, వాటిలో 461 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 9 కేసుల్లో ప్రమేయమున్న 11 మందిని అరెస్ట్ చేసి, బాధితులకు రూ.24,10,741 రీఫండ్ చేశామని చెప్పారు. సైబర్ పెట్రోల్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్న 124 ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లను పోలీసులు గుర్తించారు. ఇవి 539 పెయిడ్ అడ్వర్టయిజ్మెంట్లను నడుపుతూ యువతను ఆకర్షిస్తున్నాయని, వీటిని కంట్రోల్ చేయడానికి సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లకు 124 ప్రొఫైల్‌లను తెలిపి వాటిని తొలగించామని పోలీసులు చెప్పారు. సీమిత్ర ద్వారా 2,396 మంది బాధితులకు ఫోన్ చేసి మార్గదర్శకత్వం, సహాయం అందించామని, అంతేకా కుండా సీమిత్రకు అందిన ఫిర్యాదుల ఆధారంగా 257 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని తెలిపారు.