సిటీబ్యూరో: అవినీతిమయంగా కూరుకుపోయిన అడ్వర్టయిజ్మెంట్ విభాగంలో ప్రక్షాళన చేపట్టేందుకు కమిషనర్ కర్ణన్ సిద్ధమయ్యారు. గడిచిన కొన్ని నెలలుగా బల్దియా ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయాల ఆదాయానికి గండికొడుతూ ప్రైవేట్ ఏజెన్సీలతో చేతులు కలిపి సదరు అధికారిణి భారీగా వెనుకేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విలీనమైన శివారు పురపాలికల్లో ఒక్కో కారిడార్లో అనుమతి లేని ప్రకటనల ఏజెన్సీల నుంచి సదరు అధికారిణి ఏకంగా రూ.10 లక్షల చొప్పున లంచం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 9న అనుమతులు లేని ప్రకటనల బోర్డులు, అధికారుల పాత్రపై ‘ప్రకటనల మాటున లక్షల దందా’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని సీరియస్గా తీసుకున్న అదనపు కమిషనర్ ప్రియాంక అల సంబంధిత అధికారిణిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సదరు అధికారిణిపై బదిలీ వేటుకు రంగం సిద్ధమైంది.