HomeKhammamCongress Government Negligence On Government Medicine
బెడ్లు పుల్లు వైద్యులు నిల్లు
ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెంలోని సర్కారు వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో పాటుపడింది. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసి వాటిల్లో బెడ్ల సంఖ్యను పెంచింది.
సర్కారు వైద్యంపై శీతకన్ను
కీలకమైన ‘భద్రాద్రి’ ఏజెన్సీ ప్రాంతంలో వైద్యుల భర్తీలో నిర్లక్ష్యం
మెరుగైన వైద్య సేవల కోసం ఆసుపత్రుల స్థాయిని పెంచిన గత సీఎం
నాణ్యమైన వైద్యం కోసం బెడ్ల సంఖ్యనూ పెంచిన గత ప్రభుత్వం
కానీ, వాటిల్లో వైద్యుల పోస్టులు నింపని ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం
కేవలం కాంట్రాక్టు వైద్యులతోనే నెట్టుకొస్తున్న కాంగ్రెస్ సర్కారు
భద్రాద్రి జిల్లాలో 134 పోస్టులకు గాను.. 69 వైద్యుల పోస్టులు ఖాళీనే..
మూడు ఆసుపత్రులకు అసలు పోస్టులే లేని దైన్యం
కనీసం క్యాడర్ స్ట్రెంగ్త్ కూడా లేకుండా ఆసుపత్రులను నెట్టుకొస్తున్న వైనం
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెంలోని సర్కారు వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో పాటుపడింది. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసి వాటిల్లో బెడ్ల సంఖ్యను పెంచింది. కానీ, ప్రస్తుత సర్కారు మాత్రం వాటిల్లో కనీసం వైద్యుల పోస్టులను కూడా నింపడం లేదు. కనీస క్యాడర్ స్ట్రెంగ్త్ లేకుండా కూడా ఆసుపత్రులను నడిపిస్తోంది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో తగిన సంఖ్యలో వైద్యుల్లేక రోగులు అనేక అవస్థలు పడుతున్నారు.
కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లకు దగ్గర పడుతున్నా సర్కారు వైద్యసేవలపైగానీ, ఆసుపత్రుల అభివృద్ధిపైగానీ ఆ శాఖ మంత్రి ఒక్క రివ్యూ కూడా పెట్టిన పాపాన పోలేదు. గత సర్కారు పుణ్యమా అని మారుమూల ఆసుపత్రులు అప్‌గ్రేడ్ అయ్యాయి. కొత్త భవనాలకు నిధులు కూడా మంజూరయ్యారు. కానీ, ఇప్పుడొచ్చిన రేవంత్ ప్రభుత్వం ఆ నిధులను వినియోగించి కొత్త భవనాలను పూర్తిచేసేందుకు పూనుకోవడం లేదు. భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకూ ఉన్న ఏడు ఏరియా ఆసుపత్రుల పరిధిలోని మూడు ఆసుపత్రుల్లో అసలు వైద్యులే లేనట్లు లెక్కలు చెబుతున్నాయి. మిగతా ఆసుపత్రుల్లోనూ 134 వైద్యుల పోస్టులకు గాను.. 69 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు తేల్చి చెబుతుండడం గమనార్హం.
కాంట్రాక్టు వైద్యులతో సరిపెడుతూ..
ఇల్లెందు, అశ్వారావుపేటల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 చొప్పున ఉన్న బెడ్లను గత కేసీఆర్ ప్రభుత్వం 100 చొప్పున పెంచింది. మణుగూరులోని 50 బెడ్లను 100 బెడ్లుగా, పాల్వంచలోని 30 బెడ్లను 50 బెడ్లుగా పెంచింది. చర్ల పీహెచ్‌సీని 30 బెడ్ల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసింది. బూర్గంపహాడ్ సీహెచ్‌సీని కూడా 30 బెడ్ల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసింది. ఆ ఆసుపత్రి అభివృద్ధి కోసం అప్పటి ఎమ్మెల్యే ద్వారా నిధులు కూడా కేటాయించింది. కానీ, ఇప్పుడొచ్చిన ప్రభుత్వం ఆ నిధులతో అక్కడి వైద్యశాలను అభివృద్ధి చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. ఇక వైద్యుల నియామకంలోనూ ప్రస్తుత సర్కారు తీరు నిర్లక్ష్యంగానే ఉంది. కాంట్రాక్టు వైద్యులను నియమించి ప్రభుత్వాసుపత్రులను నెట్టుకొస్తోంది. రేవంత్ సర్కారు కొలువుదీరి 20 నెలలు కావొస్తున్నా ఒక్కరంటే ఒక్క వైద్యుడిని కూడా నియమించకపోవడం గమనార్హం. ఇన్ని ఆసుపత్రుల్లో రెగ్యులర్ గైనకాలజిస్టులు ఇద్దరే ఇద్దరు ఉన్నారంటే సర్కారు పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నర్సుల పోస్టులూ ఖాళీగానే..
వైద్యుల పోస్టులేగాక నర్సుల నియామకాల్లోనూ కొత్త ప్రభుత్వం శ్రద్ధ పెట్టిందిలేదు. ఉన్న కొద్దిపాటి నర్సులతోనే కొన్ని ఆసుపత్రులు సర్దిపెట్టుకోవాల్సి వస్తోంది. చర్ల మండలంలో అసలు నర్సులే లేరు. 16 నర్సుల పోస్టులకు అన్నీ ఖాళీగానే ఉన్నాయి. పారామెడికల్ స్టాఫ్‌లో ఒక పోస్టుకు గాను అదీ కూడా ఖాళీగానే ఉంది. పాల్వంచలో 20 మంది నర్సింగ్ సిబ్బంది ఉండాల్సి ఉండగా.. 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మణుగూరులో 46 మందికి గాను.. 21, బూర్గంపహాడ్‌లో 16కు గాను.. 7, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో 77కు గాను.. 45, ఇల్లెందులో 32కు గాను.. 15, అశ్వారావుపేటలో 18కి గాను.. 13 ఖాళీగానే ఉన్నాయి. దీంతో అక్కడ ఉన్న నర్సుల సేవలనే కాంట్రాక్ట్ వైద్యులు వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే..
తెలంగాణ ఏర్పాటుకు ముందు జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలలను చూస్తే ‘అమ్మో.. ఇవేం ఆసుపత్రులు? ఇంత దుర్భరంగా ఉన్నాయేంటి?’ అనే వాళ్లు. కానీ, తెలంగాణ వచ్చాక గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులనూ అభివృద్ధి చేసింది. బెడ్ల సంఖ్యను పెంచింది. డయాలసిస్ కేంద్రాలు కూడా మంజూరు చేసింది. కానీ, ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం వైద్యులను కూడా నియమించడం లేదు. మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత గత సీఎం కేసీఆర్‌దే.
-దిండిగాల రాజేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్
కాంగ్రెస్ వచ్చాక ఒక్క వైద్యుడినీ నియమించలేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ పాత రోజులొచ్చినట్లయింది. చర్ల మండలంలో ఇప్పటికీ జడ్డీ మీద రోగులను తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. చర్ల ఆసుపత్రి స్థాయిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. కానీ, రేవంత్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి రెండేళ్లు దగ్గర పడుతున్నా ఒక్క వైద్యుడిని కూడా నియమించలేదు. భద్రాచలం పెద్దాసుపత్రిలో కూడా గైనిక్ డాక్టర్ ఒక్కరే ఉన్నారు.
-మానే రామకృష్ణ, బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఆన్‌చార్జి
గత ప్రభుత్వంలోనే బూర్గంపహాడ్‌కు 30 బెడ్లు..
బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆసుపత్రి ఒకప్పుడు పీహెచ్సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) స్థాయిలో ఉండేది. గత ప్రభుత్వం దానిని సీహెచ్‌సీ (సామాజిక ఆరోగ్య కేంద్రం)గా అప్‌గ్రేడ్ చేసింది. దాంతోపాటు 30 బెడ్లను ఏర్పాటు చేసింది. కొత్త భవన నిర్మాణానికి నిధులు కూడా కేటాయించింది. కానీ, ఇంతలో వచ్చిన కొత్త ప్రభుత్వం.. ఈ ఆసుపత్రిపై శీతకన్ను వేసింది. దీంతో వైద్యం కూడా కుంటుపడింది. ఇప్పుడిక్కిడ సరిపడా వైద్యుల్లేరు. సిబ్బంది లేదు.
-కామిరెడ్డి శ్రీలత, మాజీ జడ్పీటీసీ, బూర్గంపహాడ్
బెడ్లు పెరిగాయి.. పోస్టులు భర్తీ కాలేదు..
జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య పెరిగింది. కానీ, వైద్యుల పోస్టులు పెరగలేదు. దీంతో కాంట్రాక్టు పద్ధతిలో వైద్యులను నియమించుకొని వైద్యసేవలు అందిస్తున్నాం. జిల్లాలోని ముగ్గురు ఐఏఎస్‌ల భార్యలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేసుకున్నారు. సరిపడా సిబ్బంది, వైద్యులు ఉంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే కాన్పులు కూడా వంద శాతం ఇక్కడకే వస్తాయి. డయాలసిస్ కేంద్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి.