ఖమ్మం అర్బన్, సెప్టెంబర్ 5: గ్రామ పాలన అధికారుల (జీపీవో) పోస్టులను నిరుద్యోగులతోనే భర్తీ చేయాలని ఖమ్మం జిల్లా నిరుద్యోగులు, ఉద్యోగార్థులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులకే ఉద్యోగాలిచ్చి కొత్తగా ఉద్యోగాలిచ్చినట్లు రేవంత్ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం దారుణమని మండిపడ్డారు. జీపీవో పోస్టులను ఇప్పటికే విధుల్లో ఉన్న ఉద్యోగులతో కాకుండా నిరుద్యోగులతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం ఎదుట శుక్రవారం నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన జీపీవో పోస్టుల నియామకాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నియామకపత్రాలు ఇచ్చి తామే ఉద్యోగాలు ఇచ్చినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. తక్షణమే 6 వేల జీపీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని, నిరుద్యోగులతోనే ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ నినాదాలు చేశారు.