మాగనూరు : నారాయణపేట జిల్లా మాగనూరు ( Maganur ) మండలంలో అక్రమంగా ఇసుక రవాణా (Illegal sand) జోరందుకుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుంది. మండల కేంద్రంతో పాటు వర్కూరు, నేరడగం, అడవి సత్యారం, పెగడబండ, మంది పల్లి, గజరం దొడ్డి గ్రామ శివారులో ఉన్న పెద్ద వాగు నుంచి ఇసుక కాంట్రాక్టర్లు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అడ్డగోలుగా ఇసుక దోచుకుంటున్నారు.
రాత్రి అడిగే వారు లేకపోవడంతో వందల ట్రాక్టర్లు వాగులో దించి ఇష్టానుసారంగా ఇసుక తరలించి రూ.4 వేల నుంచి రూ. 5 వేల ఒక ట్రాక్టర్ చొప్పున ఇసుక అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నట్లు గ్రామస్థులు ఆరోపించారు. శనివారం ఉదయం నేరడగం పరివాహక ప్రాంతమైన పెద్ద వాగు నుంచి ఉదయం 6 గంటల నుండి ఏడు ట్రాక్టర్లతో మక్తల్ మండల కేంద్రంలో సీసీ రోడ్ల నిర్వహణ కోసం ఇసుక అక్రమంగా తరలిస్తుండగా జిల్లా ఎస్పీకి కొందరు ఫిర్యాదు చేశారు.
ఎస్పీ ఆదేశాల మేరకు రెండు ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్లను రెండు ఖాళీ ట్రాక్టర్లను మాగనూరు పోలీసులు పట్టుకొని స్టేషన్కు తరలించారు. ఎస్సై అశోక్ బాబు మాట్లాడుతూ నేడుగం గ్రామానికి చెందిన కురువ లక్ష్మప్ప , ఆకుల కథల్ సాబ్, ఎర్ర బుజ్జప్ప, సురేష్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ ఇసుకు రవాణాకు పాల్పడితే ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ సురేష్ కుమార్ హెచ్చరించారు.