మహబూబ్ నగర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నేడు బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ (BC Bandh) మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా కొనసాగుతున్నది. మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ కార్యాలయ పరిధిలోని వివిధ డిపోలకు చెందిన 800 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం 6 గంటలకే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తోపాటు (Srinivas Goud) బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు అంతా డిపోల ముందు బైఠాయించారు.
ఆర్టీసీ బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులన్నీ లేకపోవడంతో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. బంద్ లో భాగంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని డిపోల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ను ఏర్పాటు చేశారు. బంద్‌లో భాగంగా ప్రయివేట్ స్కూల్స్ అన్నింటికీ ముందుగానే సెలువులు ప్రకటించి బంద్‌లో పాల్గొంటున్నాయి.
మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపో ముందు బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌండ్ బైఠాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సవరణతోనే బీసీలకు రిజర్వేషన్లు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. 240 మంది ఎంపీలు ఉన్న కాంగ్రెస్ కూటమి పార్లమెంటులో ఎప్పుడూ మాట్లాడలేదని, కొట్లాడలేదన్నారు. చట్టం లేదు కాబట్టే కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వచ్చాయని చెప్పారు. అనేక రాష్ట్రాల జీవోలు ఇప్పటికే కొట్టేశారన్నారు. తాము కూడా గతంలో జీవో ఇస్తే కొట్టేశారని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేసింది ప్రభుత్వంలోని వారేనని ఆరోపించారు. న్యాయస్థానాలు చట్టానికి లోబడి ఉంటాయని, అందుకే చట్ట సవరణ చేయాలని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు. మోసం చేసినవారిని వదిలేదని స్పష్టం చేశారు.
రెండు జాతీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు బీసీ ధర్నాలో పాల్గొని డ్రామా చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నా పేరుతో రాష్ట్రపతి, ప్రధాని మోదీని కలువలేదని మండిపడ్డారు. కోర్టులో నిలబడదని తెలిసి జీవో ఇచ్చి బీసీలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంటులో కొట్లాడలేదని విమర్శించారు. బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. బీసీలకు పదవులు ఇచ్చింది బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు.