Toxic | కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా “టాక్సిక్” మరోసారి వార్తల్లో నిలిచింది. గోవా డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా మొదట మార్చి 19న విడుదల కావాల్సి ఉండగా, తాజాగా విడుదల తేదీని జూన్ 4కు వాయిదా వేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులే ఈ నిర్ణయానికి కారణమని అధికారికంగా వెల్లడించినప్పటికీ, సినిమా వాయిదా వెనుక మరికొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో హీరో యష్‌కు ఉన్న భారీ క్రేజ్ ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కెజిఎఫ్ సిరీస్ తర్వాత అక్కడ ఆయనకు మంచి మార్కెట్ ఏర్పడింది. గల్ఫ్ దేశాల్లో తెలుగు, కన్నడ, హిందీ వెర్షన్లకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు స్పందిస్తారు.
అలాంటి కీలక మార్కెట్లో సినిమా సరైన సమయంలో విడుదల కాకపోతే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని నిర్మాతలు భావించినట్లు సమాచారం. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా థియేటర్ బిజినెస్‌పై ప్రభావం పడే అవకాశముండటంతో మేకర్స్ జాగ్రత్తగా సినిమా విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక మరో ప్రధాన కారణం యష్ పర్ఫెక్షనిజం అని చెబుతున్నారు. ఇటీవల చిత్ర బృందానికి స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా, అందులోని కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాలు ఆయనను పూర్తిగా సంతృప్తి పరచలేదని సమాచారం. దీంతో ఆ సన్నివేశాలను తిరిగి రీ వర్క్ చేయాలని యష్ టీమ్‌కు సూచించినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా ఉండటంతో క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, పూర్తిస్థాయిలో సంతృప్తి చెందిన తర్వాతే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇంకా పూర్తిగా ముగియలేదని సమాచారం. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై చిత్ర బృందం ఎక్కువ సమయం తీసుకుంటోంది. ఇటీవల విడుదలైన టాక్సిక్ ఫస్ట్ సింగిల్‌కు మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో సంగీత విభాగంపై మరింత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కెజిఎఫ్2 తర్వాత యష్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో “టాక్సిక్” పై అంచనాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన కెజిఎఫ్2 తర్వాత ఆయన నుంచి వచ్చే తదుపరి ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏ విషయంలోనూ తొందరపడకుండా పూర్తి స్థాయి అవుట్‌పుట్ సిద్ధమైన తర్వాతే సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది.