BC Reservations | రాయపోల్, అక్టోబర్ 18: బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ బిల్లు పెట్టిన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని తెలిపారు. అదే సందర్భంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలియాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 ప్రకారం 31 డి 1,2 రెండు ప్రకారం గతంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బిహార్ రాష్ట్రంలో 50% మించాయని, తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ జరిపిన కుల గణన ప్రకారం బీసీలు 57% ఉన్నారని అన్నారు. ప్రస్తుతం ఉన్న 27% రిజర్వేషన్లతో రాజకీయ, ఆర్థిక, విద్య, సామాజిక రంగాలలో బీసీలు వెనుకబడ్డారని అన్నారు. బీసీ బిల్లును 9వ షెడ్యూల్ చేర్చి పార్లమెంట్లో ఆమోదింపజేసే బాధ్యత కాంగ్రెస్, బీజేపీపై ఉందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటం చేస్తామని, భవిష్యత్తులో మరింత ఆందోళనకు సిద్ధమవుతామని పేర్కొన్నారు.