Nani | నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి ఇటీవల విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంటోంది. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించడంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది రీల్స్‌తో ఈ పాట ట్రెండ్ అవుతోంది. ఈ పాటలో హీరోను స్లమ్ సామ్రాట్‌గా చూపించేందుకు చిత్రబృందం భారీ స్థాయిలో సెట్స్ నిర్మించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ‘ఆయా షేర్’ పాట చిత్రీకరణ కోసం దాదాపు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా స్లమ్ సెట్స్ రూపొందించారు. ఇందులో హీరో ఇంటి కోసం ప్రత్యేకంగా ఒక కమాన్ స్టైల్ హౌస్ సెట్ నిర్మించారు. ఈ నిర్మాణం సుమారు 60 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు, 25 అడుగుల లోతుతో రూపొందించారు. ఈ సెట్ నిర్మాణానికి సుమారు 25 మంది కార్మికులు 20 రోజుల పాటు శ్రమించారు.
ఈ పాటలో కనిపించే మరో ప్రధాన హైలెట్ వాటర్ బాడీ విలేజ్ సెట్. ఇది కూడా రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో రూపొందించబడింది. ఇందులో డమ్మీ సెట్స్ కాకుండా నిజమైన ఇళ్లలా కనిపించేలా సుమారు 60 ఇళ్లు నిర్మించారు. ఆ గ్రామ వాతావరణాన్ని నిజంగా కనిపించేలా చేయడానికి 50 మంది కార్మికులు దాదాపు 30 రోజుల పాటు పనిచేశారు. మొత్తం మీద 500 మంది నివసించే గ్రామంలా కనిపించేలా సెట్స్ డిజైన్ చేశారు. గ్రామం మధ్యలో ఉండే వాటర్ బాడీ కోసం సుమారు 100 ట్యాంకర్ల నీటిని తీసుకువచ్చి వారం రోజుల పాటు నింపారు. అదనంగా మరో చిన్న చెరువును కూడా తవ్వి సహజత్వాన్ని తీసుకొచ్చారు.
ఇక ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ భారీ డంప్ యార్డ్. దీనిని 120 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుతో రూపొందించారు. ఈ సెట్ నిర్మాణానికి కూడా దాదాపు 25 మంది కార్మికులు నెల రోజుల పాటు శ్రమించారు. ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా ఉండేలా ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. సెట్స్ మరింత సహజంగా కనిపించేందుకు ఏజింగ్ టెక్నిక్స్ కూడా ఉపయోగించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘ది ప్యారడైజ్’ చిత్రానికి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఆయనకు ఇది నాని తో రెండో సినిమా. గతంలో నాని హీరోగా వచ్చిన ‘దసరా’ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ సినిమాను నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.