Hanuman Ansh | బాలీవుడ్లో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన సంచలనం ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh). ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో భారీ వసూళ్లతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక దృశ్యకావ్యాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేయగా, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కన ఈ చిత్రంలో షోభిన్సౌ సత్య (Shobhinaw Satyaa) ప్రధాన పాత్రలో నటించగా, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్బర్గ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలను సైతం ప్రభావితం చేసిన నీమ్ కరోలి బాబా తత్వం మరియు ఆయన దివ్య ప్రయాణాన్ని ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. మాతృమూర్తి మరణం తర్వాత దేవుడి అన్వేషణలో ఇల్లు వదిలివెళ్లిన ఒక చిన్న బాలుడు (లక్ష్మీ నారాయణ్) ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించి నీమ్ కరోలి బాబాగా ఎలా రూపాంతరం చెందారనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.