LB Sriram | టాలీవుడ్లో నటుడిగా, రచయితగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరాం. తనదైన హాస్యం, సహజమైన నటన, చక్కటి సంభాషణలతో ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించిన ఆయన.. తాజాగా ఓ సినిమా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉండటానికి గల కారణాలను వివరిస్తూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సినిమాల్లోకి రాకముందు దాదాపు 10 నుంచి 15 ఏళ్ల పాటు తాను రంగస్థల నటుడిగా కొనసాగానని ఎల్బీ శ్రీరాం గుర్తుచేసుకున్నారు. నాటకరంగంలో సంపాదించిన అనుభవంతోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టానని తెలిపారు. తన సినీ ప్రయాణంలో దాదాపు 500 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించినట్లు చెప్పారు.
నటుడిగానే కాకుండా రచయితగానూ ఎల్బీ శ్రీరాం తనదైన ముద్ర వేశారు. ‘హలో బ్రదర్’, ‘హిట్లర్’ వంటి సినిమాలతో పాటు సుమారు 40 విజయవంతమైన చిత్రాలకు సంభాషణలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తాను సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉండటానికి ప్రధాన కారణాన్ని కూడా ఎల్బీ శ్రీరాం వెల్లడించారు. ఒకప్పుడు తనతో కలిసి పనిచేసిన, తనతో పాటు ప్రేక్షకులను నవ్వించిన కమెడియన్స్ చాలామంది ఉన్నత స్థాయికి వెళ్లిపోయారని అన్నారు. మరోవైపు తన సినీ ప్రయాణంలో ఎంతో కీలక పాత్ర పోషించిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వంటి వారు దూరం కావడం తనను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.తన స్థాయికి తగ్గ పాత్రలు, నటనకు ఆస్కారం ఉన్న క్యారెక్టర్లు రావడం తగ్గిపోవడంతోనే వెండితెరకు కొంత దూరంగా ఉన్నానని ఎల్బీ శ్రీరాం స్పష్టం చేశారు.
కేవలం తెరపై కనిపించడం కోసం తనకు నచ్చని పాత్రలు చేయాలని అనుకోవడం లేదని ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. అయితే సినిమాలకు దూరమైనా నటనపై తనకున్న ప్రేమ మాత్రం తగ్గలేదని చెప్పారు. తనలోని నటుడిని సజీవంగా ఉంచుకోవడంతో పాటు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేయడం ప్రారంభించినట్లు తెలిపారు. డిజిటల్ వేదికల ద్వారా తనకు నచ్చిన కథలు, పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని చెప్పారు. ఇదిలా ఉంటే, సుదీర్ఘ విరామం తర్వాత ఎల్బీ శ్రీరాం కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆయన బుర్రకథ గురువు పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మికి కళలో దిశానిర్దేశం చేసే గురువు పాత్రలో ఎల్బీ శ్రీరాం కనిపించనున్నారు. అక్టోబర్ 17న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.