Nizamabad | పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌కు చెందిన టీ స్టాల్ నిర్వాహకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. భీమ్‌గల్ పట్టణంలోని దేవాంగపల్లికి చెందిన పొలాస సుధాకర్ సోమవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆయనను తొలుత నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించి, అనంతరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సమాచారం.
సుధాకర్ భీమ్‌గల్ బస్టాండ్ సమీపంలో టీ స్టాల్ నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. అక్కడ టీ, సిగరెట్లు, పాన్ మసాలా తదితరాలను విక్రయించేవాడు. రాత్రి 10 గంటల తర్వాత దుకాణం నిర్వహిస్తున్నాడంటూ పోలీసులు గతంలో పలుమార్లు జరిమానాలు విధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం మరోసారి జరిమానా విధించడంతో దాన్ని చెల్లించేందుకు సోమవారం సుధాకర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అయితే తనపై కేసు నమోదు చేశామని, జరిమానాను కోర్టులో చెల్లించాలని పోలీసులు చెప్పడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సుధాకర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందాడు.
కాగా, తనపై ఎస్సై తిరుపతి పలుమార్లు జరిమానాలు విధించారని, కొంతకాలంగా ఓ వ్యాపారితోపాటు కొందరు విలేకరులు తనను వేధిస్తున్నారని సుధాకర్ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జరిమానా విషయంలో ఎంతగా అభ్యర్థించినా అధికారులు స్పందించలేదని వారు ఆరోపించారు.
ఈ ఘటనలో పోలీసుల తప్పేమీ లేదని నిజామాబాద్ సీపీ సాయిచైతన్య తెలిపారు. సుధాకర్ దుకాణానికి ఎదురుగా ఉన్న ఓ కిరాణా షాప్ యజమాని తన వద్ద సిగరెట్లు కొనడం లేదనే కారణంతో ఇద్దరు రిపోర్టర్లను అతడి వద్దకు పంపి బెదిరించాడని వివరించారు. రాత్రి వేళల్లో దుకాణం నిర్వహిస్తున్నందుకు పోలీసులు పెట్టీ కేసు నమోదు చేశారని తెలిపారు. సుధాకర్ మృతిపై పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు, పోలీసుల వివరణ తదితర అంశాలపై విచారణ కొనసాగుతోంది.