సాధారణంగా ఒక్కో పరీక్షా కేంద్రంలో వందలాది మంది ఎగ్జామ్స్ రాస్తుంటారు. కానీ నాగర్‌కర్నూలు జిల్లాలో మాత్రం విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేకంగా ఎగ్జామ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణకు ఒక ఇన్విజిలేటర్, సూపరింటెండెంట్‌ను నియమించారు. ఎగ్జామ్ సెంటర్‌కు పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా చేసి ఇవాళ ఎగ్జామ్ పెడితే.. ఆ ఒక్క విద్యార్థి ఎగ్జామ్‌కు డుమ్మా కొట్టి అధికారులకు షాకిచ్చాడు.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూలు జిల్లాలో బ్రిడ్జి కోర్సుకు సంబంధించి పరీక్షల కోసం ఇటీవల దరఖాస్తులను స్వీకరించారు. కానీ దీనికి పెద్దగా స్పందన రాలేదు. ఇంటర్ పూర్తి చేసుకున్న వరుణ్ సందేశ్ అనే విద్యార్థి ఒక్కడే పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు.
జనరల్ బ్రిడ్జి కోర్సు మ్యాథమేటిక్స్ పరీక్ష రాసేందుకు ఫీజు చెల్లించాడు. ఒక్కడే విద్యార్థి దరఖాస్తు చేసుకున్నాడని అధికారులు పట్టించుకోకుండా ఉండలేదు. విద్యార్థికి ఆసక్తి ఉందని భావించి, ఆ ఒక్కడి కోసమే జిల్లాలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణకు ఒక ఇన్విజిలేటర్, సూపరింటెండెంట్‌ను కేటాయించారు. అలాగే పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇంతా చేసినా ఆ ఒక్క విద్యార్థి మాత్రం ఎగ్జామ్‌కు హాజరుకాలేదు. దీంతో పరీక్షా కేంద్రం ఖాళీగా కనిపించింది. ఒక్క విద్యార్థి కోసం చేసిన ఏర్పాట్లు అన్నీ వృథా కావడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.