Ustaad Bhagat Singh | రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఎన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చినా సరే, ఒక మంచి సినిమా పడితే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా నిరూపించింది. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం పవన్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు అదే కాంబినేషన్లో మరోసారి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం విడుదల విషయంలో అనుకున్న దానికంటే కొంత ఆలస్యం జరిగింది. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పాటలు విడుదలయ్యాయి. అయితే ‘గబ్బర్ సింగ్’లో వచ్చిన ప్రతి పాట మాదిరి భారీ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ మాత్రం రావడం లేదు. కొన్ని పాటలకు మిక్స్డ్ టాక్ మాత్రమే రావడం గమనార్హం. దీంతో ఇప్పుడు సినిమా హైప్‌ను మళ్లీ పెంచే బాధ్యత ట్రైలర్‌పై పడిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం అభిమానులంతా కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్ మాదిరిగా మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ట్రైలర్ వస్తే, ఒక్కసారిగా సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించే బాధ్యత మొత్తం దర్శకుడు హరీష్ శంకర్ మీదే ఉందని చెప్పవచ్చు. గతంలో ‘గబ్బర్ సింగ్’ టీజర్ కూడా చిన్న చిన్న డైలాగ్‌లతోనే భారీ సెన్సేషన్ సృష్టించింది. అదే మ్యాజిక్‌ను ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్లో కూడా రిపీట్ చేయగలిగితే సినిమా విడుదలకు ముందే భారీ మైలేజ్ దక్కే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, ఇప్పటికే భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌కు ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయని చెప్పాలి. ట్రైలర్ ఎలా ఉంటుందో, అది అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది.