వాషింగ్టన్: అమెరికా దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందిన నేపథ్యంలో ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం నేతగా ఎన్నికయ్యారు. అయితే మొజ్తాబాను సుప్రీం నేతగా అంగీకరించేందుకు అమెరికా నిరాకరిస్తున్నది. ఈ నేపథ్యంలో అమెరికా సర్కారు భారీ ప్రకటన చేసింది. మొజ్తాబా ఖమేనీతో పాటు ఇరాన్ రెవల్యూషనీ గార్డ్ కార్ప్స్కు చెందిన కొందరు సీనియర్ అధికారుల వివరాలను వెల్లడిస్తే వారికి 93 కోట్ల నజరానా ఇవ్వనున్నట్లు అమెరికా(US Reward) ప్రకటించింది. శుక్రవారం ఈ రివార్డుపై ప్రటక చేశారు.
డిప్లమాటిక్ సెక్యూర్టీ సర్వీస్‌కు చెందిన అమెరికా రివార్డు శాఖ ఈ ప్రకటన చేసింది. ఐఆర్జీసీ నేతల్ని అంతం చేస్తే 10 మిలియన్ల డాలర్లు ఇవ్వనున్నట్లు అమెరికా తన రివార్డులో వెల్లడించిన విషయం తెలిసిందే. అమెరికా ప్రకటించిన జాబితాలో మొజ్తాబా ఖమేనీతో పాటు ఇరాన్ సుప్రీం నేత ఆఫీసు డిప్యూటీ చీఫ్ అలీ అస్ఘర్ హెజాజి, ఇరాన్ సెక్యూర్టీ చీఫ్ అలీ లారిజాని పేర్లు ఉన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం మూడో వారంలోకి ఎంటరైంది.
ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఇరాన్‌లోని 15 వేల ప్రాంతాలను టార్గెట్ చేశామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ తెలిపారు.రోజుకు కనీసం వెయ్యి టార్గెట్లను ధ్వంసం చేస్తున్నామన్నారు. క్షిపణులు, డ్రోన్ల దాడులను ఇరాన్ దాదాపు 90 శాతం తగ్గించినట్లు ఆయన చెప్పారు.