Rayapol | రాయపోల్, అక్టోబర్18: మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. శారీరకంగా తన కోరిక తీరిన తర్వాత మొహం చాటేశాడు. పెళ్లి చేసుకోమని బాలిక బతిమిలాడినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సిద్దిపేట జిల్లా రాయపోల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
తొగుట సీఐ లతీఫ్, రాయపోల్ ఎస్సై మానస తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాంసాగర్ గ్రామానికి చెందిన మైనర్ బాలిక (17) ఇంటర్ వరకు చదువుకుంది. ఐదు నెలలుగా కుట్టు మిషన్ నేర్చుకుంటుంది. అదే గ్రామానికి చెందిన జోడు శ్రీకాంత్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత మూడేళ్లుగా వీరిద్దరికీ పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని ఆసగా చేసుకున్న శ్రీకాంత్ బాలికతో చనువు పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతికి దగ్గరయ్యాడు. శారీరకంగా కూడా బాలికను వాడుకున్నాడు. కోరిక తీరడంతో ఆమెను పెళ్లిను పట్టించుకోవడం మానేశాడు. ఇదే క్రమంలో పెళ్లి చేసుకోమని బాలిక కోరడంతో.. పెళ్లి చేసుకోనని కరాఖండీగా చెప్పేశాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంది. కూతురు ఏడవడం గమనించిన తల్లి ఏమైందని అడగ్గా.. జరిగిందంతా చెప్పింది. దీంతో బాలిక తల్లి రాయపోల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీకాంత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.