ఇల్లెందు, అక్టోబర్ 18 : పాఠశాల స్థాయి నుండే బాలికలు క్రీడలపై మక్కువ పెంచుకుని పోటీల్లో రాణించాలని భద్రాచలం గిరిజన శాఖ ఏసీఎంఓ రమేశ్ అన్నారు. శనివారం ఇల్లెందు మండలం బొజ్జయిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో రెండో రోజు జరుగుతున్న ఇల్లెందు జోనల్ స్థాయి క్రీడా పోటీలకు ఆయన హాజరై బాలికల అథ్లెటిక్స్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలికలకు ఇల్లెందు జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించి 135 మంది బాలికలను జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. అలాగే శుక్రవారం రోజున బాలుర విభాగంలో 135 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. వీరు నవంబర్లో కిన్నెరసాలలో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నాగమణి, రాంబాబు, బుగ్గ వెంకటేశ్వర్లు, గోపాల్ రావు, కృష్ణవేణి, లక్ష్మి, కస్నా, శిరోమణి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.