‘స్కీయింగ్ డెస్టినేషన్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన ఔలీ ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి 8,200 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం వేసవి విడిదిగా ప్రసిద్ధి. శీతకాలంలో మంచు దుప్పటి కప్పుకొని ఔరా! అనిపిస్తుంది. ఆపిల్ తోటలు, ఓక్ చెట్లు మంచుతో ధవళకాంతులీనుతున్నాయి. ప్రకృతి ఆరాధకులకు, సాహసయాత్రికులకు సరైన అడ్డా ఔలీ! మంచు కొండల్లో స్కీయింగ్ చేయడానికి ఉత్సాహం చూపతారు పర్యాటకులు. స్కీయింగ్ ట్రైనింగ్ క్యాంప్‌లు కూడా ఉంటాయి. అనుభవం లేకున్నా.. ప్రాథమిక శిక్షణ పొంది.. స్కీయింగ్ చేసేయొచ్చు.
ట్రెక్కింగ్ చేయాలనుకునేవారికి ఎక్కడానికి కావాల్సినన్ని కొండలున్నాయి. అయితే సాధారణ పర్యాటకులకు ట్రెక్కింగ్ కాస్త కష్టమే! జోషిమఠ్ నుంచి ఔలికి కేబుల్ కారులో విహారం మనోహరంగా ఉంటుంది. సుమారు 25 నిమిషాలు సాగే నాలుగున్నర కిలోమీటర్ల ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. జోషిమఠ్‌లో సముద్రమట్టానికి 6,254 అడుగుల ఎత్తులో మొదలయ్యే కేబుల్ కారు… ఔలీ చేరుకునే సరికి 9,896 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. మేఘాలను దాటి చొచ్చుకొని వచ్చిన నందాదేవి, త్రిశూల్ వంటి పర్వతాలు.. మంచు టోపీలతో వెండి కొండల్లా మెరిసిపోతూ కనిపిస్తాయి. అక్టోబర్, నవంబర్ మాసాల్లో అక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది. డిసెంబర్ రెండో వారం నుంచి మంచు కురవడం మొదలవుతుంది. ఫిబ్రవరి చివరి వారం వరకు మంచు పడుతుంటుంది.
ఔలీ.. ఉత్తరాఖ్ండ రాజధాని డెహ్రాడూన్ నుంచి 279 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హరిద్వార్ నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్‌కు నాన్‌స్టాప్ సర్వీసు అందుబాటులో ఉంది. అక్కణ్నుంచి జోషీమఠ్‌కు ట్యాక్సీలు, బస్సులో వెళ్లొచ్చు. ఢిల్లీ వరకు విమానంలో గానీ, రైల్లోగానీ వెళ్లి అక్కడి నుంచి డెహ్రాడూన్, హరిద్వార్ మీదుగా జోషిమఠ్ చేరుకోవచ్చు.