దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. గత వారం సెన్సెక్స్ 2,368.29 పాయింట్లు కోల్పోయి 78,918.90 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 728.20 పాయింట్లు పడిపోయి 24,450.45 వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం ఉందన్న అభిప్రాయాలు మెజారిటీ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏఐ దెబ్బకు ఐటీ రంగం కుదేలవుతుందన్న భయాలకుతోడు అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మదుపరులను పెట్టుబడులకు దూరం చేస్తున్నాయి.
దీంతో ప్రధానంగా ఐటీ, ఆటో, ఎలక్ట్రానిక్, చమురు రంగా ల షేర్లు సెల్లింగ్ ప్రెషర్‌ను ఎదుర్కోవచ్చన్న అంచనాలున్నాయి. ఇక విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణలూ మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరుస్తున్నాయి. కాగా, అమ్మకాల ఒత్తిడి కొనసాగితే నిఫ్టీకి 24,100 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,900 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 24,800-25,000 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చని చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.