‘పది అంతస్తులు’ సఫలమయ్యేనా.. పట్టణ పేదలకు టవర్లు కట్టిస్తామంటున్న సర్కార్
‘ఎక్కడ నివసిస్తున్నవారికి అక్కడే ఇల్లు’ అనే పద్ధతిలో ప్రభుత్వం పట్టణ పేదలకు బహుళ అంతస్తుల టవర్లు నిర్మించనున్నట్టు ప్రకటించింది. గతంలో జీ+3 అంతస్తుల భవనాలు నిర్మిస్తామని చెప్పిన సర్కార్, తాజాగా 10 అంతస్తుల టవర్లు కడ్తామని చెప్తున్నది.
- నిర్వహణలో తప్పని ఇబ్బందులు
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : ‘ఎక్కడ నివసిస్తున్నవారికి అక్కడే ఇల్లు’ అనే పద్ధతిలో ప్రభుత్వం పట్టణ పేదలకు బహుళ అంతస్తుల టవర్లు నిర్మించనున్నట్టు ప్రకటించింది. గతంలో జీ+3 అంతస్తుల భవనాలు నిర్మిస్తామని చెప్పిన సర్కార్, తాజాగా 10 అంతస్తుల టవర్లు కడ్తామని చెప్తున్నది. ప్రభుత్వ ఆలోచన ఎలావున్నా, బస్తీల్లోని పేదలు మాత్రం తమకు టవర్లకు బదులు రూ.5 లక్షల చొప్పున ఇస్తే తామే ఇల్లు నిర్మించుకుంటామని అంటున్నారు. కానీ, ప్రభుత్వం ఇందుకు ససేమిరా అంటున్నది. పట్టణ పేదలకు దూర ప్రాంతాల్లో ఇండ్లు నిర్మిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని గత అనుభవాలు స్పష్టంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వారు ఉంటున్నచోటే ఇండ్లు నిర్మిస్తామని ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంపిక చేసిన 16 మురికివాడల్లో ముందుగా 10 అంతస్తుల టవర్లు నిర్మించనున్నట్టు తెలిపింది. ఆ తరువాత వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర ఇతర నగరాలకు కూడా ఇదే విధానాన్ని విస్తరిస్తామని ప్రకటించింది.
బహుళ అంతస్తుల టవర్ల నిర్మాణాన్ని ఆయా బస్తీవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముందుగా టవర్ల పేరుతో తమను బస్తీల నుంచి ఖాళీ చేయిస్తారని, నిర్మాణం చేపట్టినా.. రెండేండ్లలో అవి పూర్తయ్యే ఆస్కారంలేదని అంటున్నారు. రెండేండ్లలో నిర్మాణం పూర్తిచేసి తమకు అప్పగించకపోతే, వాటిపై రానున్న సర్కారు వైఖరి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. నిధుల సమస్యతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర సర్కార్, టవర్లను సకాలంలో పూర్తిచేసే అవకాశం లేదని, ఏదైనా కారణంతో నిర్మాణం మధ్యలో నిలిచిపోతే తమ పరిస్థితి ‘ఉన్నది పాయే.. కొత్తది రాకపాయే’ అనే చందంగా తయారవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. టవర్ల నిర్మాణం జరిగినంతకాలం తాము ఉండేచోట అందుబాటు ధరలో అద్దె ఇల్లు దొరికే అవకాశం లేదని, దూర ప్రాంతాలకు వెళ్తే పిల్లల స్కూళ్లకు, పని ప్రదేశాలకు దూరమవుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో ప్రభుత్వం జీ+3 పద్ధతిలో అపార్ట్మెంట్లు నిర్మిస్తామని చెప్పినప్పుడు సైతం బస్తీవాసులు వ్యతిరేకించారు.
భారం కానున్న టవర్ల నిర్వహణ
బహుళ అంతస్తుల టవర్లకు ఎలివేటర్లు తప్పనిసరి. అవి పనిచేయాలంటే విద్యుత్తుతోపాటు జనరేటర్ తప్పనిసరి. పెద్ద సంఖ్యలో కుటుంబాలు నివాసం ఉంటే ఎలివేటర్ల వాడకంపై నియంత్రణ ఉండదు. అన్ని కుటుంబాలకు మంచినీరు సరఫరా, మురుగునీటి పారుదల, పారిశుధ్య నిర్వహణ కూడా సవాల్‌తో కూడుకున్నదే. ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ప్రైవేట్ గృహ సముదాయాల్లో మాదిరిగా ఒక సొసైటీని ఏర్పాటుచేసి, ప్రతి కుటుంబం నుంచి ప్రతి నెల నిర్వహణ కోసం కొంత మొత్తాన్ని వసూలుచేసే విధానం ప్రభుత్వం నిర్మించే నివాస సముదాయాల్లో సఫలమయ్యే అవకాశం తక్కువ. నియమ నిబంధనలను అమలు చేయడం వీలుకాదు. ప్రభుత్వమే నిర్వహణకు సూపర్వైజర్లను నియమిస్తే వారికి ప్రతినెలా వేతనంతోపాటు నిర్వహణకు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో కొద్దిరోజులకే అవి నివాసయోగ్యం కాకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది.
రూ.5 లక్షలకు ఒప్పుకోని నిబంధనలు
టవర్ల నిర్మాణం, వాటిల్లో నివాసం, నిర్వహణ తదితర అంశాలు అనేక సవాళ్లతో కూడి ఉండడంతో బస్తీవాసులు వాటిని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తే తాము ఎక్కడ ఉంటున్నామో అక్కడే రెండు గదులు నిర్మించుకుంటామని, దీనివల్ల ఎవరికీ ఇబ్బ ంది ఉండదని అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రభుత్వం ఇందుకు సుముఖంగా లేదు. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ నిబంధనలు. మురికివాడల్లో నివసించే పట్టణ పేదల జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు అపార్ట్మెంట్ల నిర్మాణానికే కేంద్రం నిధులు మంజూరు చేస్తున్నది. దీంతో రూ.5 లక్షల చొప్పున మంజూరు చేసే అవకాశంలేదు. అన్నీ వెరసి ప్రభుత్వ ప్రతిపాదిత టవర్ల నిర్మాణంపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి.
టవర్ల నిర్మాణంలో ఉపయోగాలు, ఇబ్బందులు ఇలా…
- పేదలకు వారు ఉంటున్నచోటే టవర్లు నిర్మిస్తే పనులకు వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది
- పరిశుభ్ర వాతావరణంలో వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యే అవకాశముంది
- టవర్ల నిర్మాణం పూర్తయ్యే వరకు అద్దెల భారం తప్పదు
- ఏదైనా కారణంతో నిర్మాణాలు మధ్యలో నిలిచిపోతే పేదల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది.
- టవర్ల నిర్వహణలో తప్పని సమస్యలు
- విద్యుత్తు, మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, పారిశుధ్యం అంత సులభం కాదు
- అన్నీ సవ్యంగా సాగాలంటే నిధులు అవసరం. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సకాలంలో నిధులు విడుదలయ్యే అవకాశం తక్కువ.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

