హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : ‘ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ బ్రాండ్ స్కీమ్. ఈ పథకానికి పూర్వవైభవం తీసుకొచ్చాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతుంటే.. క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభించిన ఈ పథకాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీగా అమలుచేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన 27 నెలల్లో ఆరోగ్యశ్రీలో 8 మంది సీఈవోలను మార్చారు. అయినా పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులకు ఇన్సెంటివ్స్ ఇవ్వా ల్సి ఉంటుంది. 7శాతం అనస్థీషియా, 14 శాతం సర్జరీ, 4 శాతం ల్యాబ్ సిబ్బందికి ఇవ్వాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ హయాంలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి వైద్యులకు ఇన్సెంటివ్స్ చెల్లించేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారి మాత్రమే ఇన్సెంటివ్స్ చెల్లించినట్టు తెలిసింది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన మొదటి ఆరు నెలలు ‘ఆరోగ్యశ్రీ’కి ప్రాధాన్యం ఇచ్చినా.. తరువాత పథకానికి వెచ్చించాల్సిన నిధులను ఇతరాలకు మళ్లిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా పలుమార్లు నెట్వర్క్ దవాఖానలు రాష్ట్రంలో వైద్య సేవలను నిలిపివేశాయి. బకాయిలు రూ.1,000 కోట్లకు పైగా ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వ దవాఖానలకు రూ.500 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి సీఈవోలు మారుతున్నా పథకం అమలులో ఎలాంటి మార్పు కనిపించడంలేదు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి విశాలాక్షి ఆరోగ్యశ్రీ సీఈవోగా ఉన్నారు. ఆమె బదిలీ తర్వాత హెల్త్ సెక్రటరీ క్రిస్టినా అదనపు బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఐఏఎస్ కర్ణన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత శివశంకర్‌ను సీఈవోగా నియమించగా జిల్లా సమన్వయకర్తల ని యామకాల్లో అవకతవకల నేపథ్యంలో ఆ యనపై వేటుపడింది. కర్ణన్‌ను ఇన్చార్జి సీ ఈవోగా నియమించారు. ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బదీలీ కాగా, సంగీత సత్యనారాయణను ఆరోగ్యశ్రీ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. డీవోపీటీ శిక్షణకు ఢిల్లీకి వెళ్లడంతో ఆమె బాధ్యతలు స్వీకరించలేదు. ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినాజడ్చోంగ్తూకు అదనపు బాధ్యతలు అప్పగించారు. తర్వాత ఉదయ్‌కుమార్‌ను సీఈవోగా నియమించింది.