బెంగళూరు, అక్టోబర్ 18: బెంగళూరు రోడ్ల గురించి బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా చేసిన విమర్శలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం వ్యంగ్యంగా స్పందించారు. ఆమె(షా) కావాలంటే రోడ్లను అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఆమె వాటిని(రోడ్లను) అభివృద్ధి చేయాలనుకుంటే మమల్ని వచ్చి అడగవచ్చు. వెంటనే ఆమెకు రోడ్లను అప్పగించేస్తాం అని కేఆర్ పురంలో బెంగళూరు నడిగె(బెంగళూరు కోసం నడక) కార్యక్రమాన్ని నిర్వహిస్తూ డీకేఎస్ చెప్పారు. బెంగళూరు రోడ్లు, వీధులలో పేరుపోయిన చెత్తపై చైనా నుంచి వచ్చిన తన పారిశ్రామిక అతిథి ఒకరు వ్యాఖ్యానించినట్లు కిరణ్ మజుందార్ ఇటీవల వరుసగా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ప్రియాంక్ ఖర్గే, ఎంబీ పాటిల్ స్పందించారు. కేఆర్ పురం ప్రాంత అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లను కేటాయించిందని ఆయన తెలిపారు. పన్నుల రూపంలో బెంగళూరు నగరానికి రూ. 6,000 కోట్ల రాబడి ఉండగా అందులో రూ.1,600 కోట్లు కేఆర్ పురం నుంచే వస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ ప్రాంత ప్రజలు అత్యధిక పన్ను చెల్లించారని, అందుకే ఈ ప్రాంత అభివృద్ధి కోసం రూ. 50 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియచేస్తే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఎవరైనా అధికారి ముడుపులు డిమాండ్ చేస్తే 1533 నంబర్‌కి కాల్ చేయాలని, వెంటనే ఆ అధికారిని సస్పెండ్ చేస్తామని ఆయన తెలిపారు.