హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : ఆవిష్కరణలు, పెట్టుబడులకు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బ్రిక్స్ దేశాల్లో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులకు అనువైన వాతావరణం, ఆధునిక సాంకేతికతల ప్రభావంపై అధ్యయనం చేసేందుకు వచ్చిన జర్మనీ ప్రతినిధుల బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై మంత్రి వారితో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటవుతున్న ఏఐ, నెట్ జీరో సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులకు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయన్నారు.