సిద్దిపేటలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ (NEWS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దళిత విద్యార్థులకు అవార్డులు అందజేసి, వారిని ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ లాంటి మహనీయులు కల్పించిన రిజర్వేషన్ల వల్లే మనమంతా చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నామని తెలిపారు. ఆ రిజర్వేషన్ల ఫలాలతో గౌరవంగా బతుకుతున్న మనం తిరిగి సమాజానికి ఏదో ఒకటి చేయాలనే బాధ్యతను పదేళ్ల క్రితమే గుర్తించి సిద్దిపేటలో మాదిగ సామాజిక వర్గం ఉద్యోగులంతా కలిసి ‘న్యూస్’ సొసైటీని స్థాపించడం అభినందనీయమని కొనియాడారు.
నాకు సమాజం ఏం చేసింది అని అడిగేవాళ్లే ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో, మేము సమాజానికి ఏం చేయగలం అని ఆలోచించి, ఉద్యోగులు తమ వేతనం నుంచి ప్రతినెలా వెయ్యి రూపాయలు పక్కనపెట్టి 10 లక్షల రూపాయల నిధిని ఏర్పాటు చేయడం గర్వకారణమని హరీశ్‌రావు అన్నారు. ఫీజులు కట్టలేని పేద విద్యార్థులకు అండగా నిలబడుతూ, ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ ఇవ్వడం రాష్ట్రానికే ఆదర్శమని అన్నారు. ఐదేళ్ల క్రితం ఫీజు కట్టలేక నా దగ్గరకు వచ్చిన హౌసింగ్ బోర్డుకు చెందిన రోహిత్ అనే అబ్బాయికి నేను సహాయం చేశానని తెలిపారు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏడాదికి 6 లక్షల జీతం వస్తోందని పేర్కొన్నారు. తన తొలి ఏడాదంతా సంపాదించిన 6 లక్షల రూపాయలను తీసుకొచ్చి తిరిగి పేద విద్యార్థుల కోసం ఖర్చు చేయమని నాకే ఇచ్చాడని అన్నారు. కష్టపడి పైకొచ్చిన ఆ అబ్బాయి ఆలోచనా విధానం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు.
శ్రీజ అనే దళిత విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు వస్తే ఫీజు కట్టలేని పరిస్థితిలో నా దగ్గరకు వచ్చింది. ఐదేళ్ల పాటు ఆమె ఫీజు నేనే కడతానని మాట ఇచ్చాను. గత ఏడాది ఫీజు కట్టానని.. ఈరోజు మీ అందరి సమక్షంలో ఆమె రెండో సంవత్సరం ఫీజును కూడా చెల్లిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించి, ఫీజు కట్టలేక ఇబ్బంది పడే దళిత బిడ్డలు ఎవరైనా నా దృష్టికి వస్తే వాళ్ళను డాక్టర్లను చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. మంచి కార్యక్రమాలు చేస్తున్న న్యూస్ సొసైటీకి నా వంతు సహాయంగా ఈ సంవత్సరం కూడా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నానని తెలిపారు.
కేసీఆర్ హయాంలో దళిత విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు పెంచామని తెలిపారు. సిద్దిపేటలో ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ తెచ్చామన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, దళిత బంధు లాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ కు బడ్జెట్ లో 5,403 కోట్లు కేటాయించి, ఖర్చు పెట్టింది కేవలం 74 కోట్లు మాత్రమే. ఆ 74 కోట్లు కూడా జీతాలు, కరెంట్ బిల్లులకే సరిపోయాయని అన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క నిరుపేద దళిత యువకుడికి గానీ, రైతుకు గానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పైసా సహాయం అందలేదని చెప్పారు. దళితబంధు కింద 12 లక్షలు ఇస్తామని చెప్పి, బడ్జెట్ లో 2000 కోట్లు పెట్టి.. ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి సహాయం చేశారా? అని ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులు ల్యాప్స్ కావొద్దని, క్యారీ ఫార్వర్డ్ కావాలని మేము చట్టం తెస్తే.. ఈ ప్రభుత్వం 2024-25 లో 33 వేల కోట్లు ఎస్సీ నిధి కింద చూపి, ఖర్చు చేసింది కేవలం 14 వేల కోట్లే అని తెలిపారు. అందులో పెన్షన్లు అన్నీ కలిపి ఖర్చుగా చూపిస్తున్నారని అన్నారు. మాదిగ, మాల, ఏకలవ్య, సేవాలాల్, కొమురం భీమ్, బీసీ కార్పొరేషన్లు అని పేర్లు పెట్టి కాగితాలకే పరిమితం చేశారు తప్ప.. ఆ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం శోచనీయమని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లలో 19 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లించి పిల్లల చదువులకు ఆటంకం లేకుండా చూశామని అన్నారు. ఇప్పుడు డిగ్రీలు, ఇంజనీరింగ్ పూర్తయినా కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
విద్యార్థుల హక్కుల కోసం, నిధుల కోసం అసెంబ్లీలో మేము కొట్లాడుతామని… విద్యావంతులైన మీరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని గమనించాలని సూచించారు. విద్యార్థులు బాగా చదవాలన్నారు. వారి చదువుకు పేదరికం, కులం అడ్డుకాదని చెప్పారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. నాలుగైదేళ్లు క్రమశిక్షణతో కష్టపడితే మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని తెలిపారు. మీరు గొప్ప ఆఫీసర్లుగా ఎదిగి మీ తల్లిదండ్రులు, మన సిద్దిపేట గర్వపడేలా చేయాలని మనసారా దీవిస్తున్నానని అన్నారు.