సూర్యాపేట, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావం సూర్యాపేటలో కనిపిస్తోంది. గ్యాస్‌కు ఎలాంటి సమస్య లేదంటున్న కేంద్రం గ్యాస్ ధరలు పెంచింది. సిలిండర్లు దొరకడం లేదు. డొమెస్టెక్ సిలిండర్ల బుకింగ్ గడువు పెంచారు. కమర్షియల్ గ్యాస్ దొరకడం లేదు. ఆసుపత్రుల అత్యవసరాలకు మినహా కమర్షియల్ గ్యాస్ ఇవ్వడం లేదు. కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా రెండు మూడు రోజులుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో బొగ్గుల పొయ్యి, కట్టెల పొయ్యిలు దర్శనమిస్తున్నాయి. బొగ్గు, కట్టెల పొయ్యితో కాలుష్యం పెరుగుతుందని, ఆరోగ్యాలు పాడయ్యే ప్రమాదం ఉందని హోటళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే హోటళ్లు మూసుకోవాల్సిన దుస్థితి దాపురించే ప్రమాదం ఉందంటున్నారు.
నార్కట్‌పల్లి, మార్చి 13: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో డొమెస్టిక్, కమర్షియిల్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయి అండ్ ఎన్ఫోర్స్ మెంట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం నార్కట్‌పల్లి పట్టణ కేంద్రంలోని పలు హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. అక్రమంగా వినియోగిస్తున్న 20 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. సంబంధిత వ్యాపారులపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో నల్లగొండ సివిల్ సైప్లె డిప్యూటీ తహసీల్దార్ దీపక్, నకిరేకల్ సివిల్ సైప్లె డిప్యూటీ తహసీల్దార్ జ్యోతి, మిర్యాలగూడ సివిల్ సప్లయి డిప్యూటీ తహసీల్దార్ ఆర్ సైదులు, నాంపల్లి ఆర్ఐ సీఎస్ సైదులు, కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
సూర్యాపేటటౌన్, మార్చి 13: అక్రమంగా నిల్వ చేసిన 41 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. సూర్యాపేట పోలీసులు, స్పెషల్ బ్రాంచి సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో బయటపడ్డ వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ వివరించారు. పట్టణంలోని పీఎస్ఆర్ సెంటర్లో ఓ షాపులో తనిఖీ చేయగా అక్రమంగా నిల్వ చేసిన 41 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రtజల అవసరాలకు ఉపయోగపడే గ్యాస్ సిలిండర్లను అక్రమంగా అమ్మినా, నిల్వ చేసినా, కృత్రిమ కొరత సృష్టించినా, గ్యాస్ ధరలపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మిర్యాలగూడ, మార్చి 13: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడటంతో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్న పలు హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. అక్రమంగా వినియోగిస్తున్న 36 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మంజీరా బార్ అండ్ రెస్టారెంట్, హైదరాబాద్ బిర్యానీ సెంటర్, రూబీ రెస్టారెంట్‌తో పాటు పలు హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న 36 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్న వ్యాపార సంస్థల యజమానులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజా అవసరాల కోసం వినియోగిస్తున్న డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు అక్రమంగా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో డిప్యూటీ తహసీల్దార్లు సైదులుగౌడ్, ఎండీ ముక్తార్, దీపక్, జ్యోతి, ఆర్ఐలు రవీందర్‌రెడ్డి, సైదులుకుమార్ తదితరులు పాల్గొన్నారు.