ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం సివిల్ సైప్లె అండ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 165 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో డొమెస్టిక్, కమర్షియిల్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. అక్రమంగా వినియోగిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు గుర్తించారు. సూర్యాపేటలో 41, నల్లగొండలో 68, నార్కట్‌పల్లిలో 20, మిర్యాలగూడలో 36 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు హోటళ్ల యజమానులపై కేసులు నమోదు చేశారు.
మోత్కూరు, మార్చి 13 : యాదాద్రి భువనగిరి జల్లాలో వంట గ్యాస్ కొరత తీవ్రతరమైంది. మరో నాలుగు రోజుల్లో ఉగాది పండుగ ఉండటంతో గ్యాస్ కోసం జనం తండ్లాడుతున్నారు. వంట గ్యాస్ కొరత ఏర్పడుతుందంటూ వదంతులు వ్యాపించడంతో గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం వద్ద వందల సంఖ్యలో జనం క్యూలో బారులు తీరుతున్నారు. మోత్కూరులోని భారత్ గ్యాస్ ఏజెన్సీకి మూడు రోజుల నుంచి గ్యాస్ సరఫరా నిలిచి పోయింది. శుక్రవారం గ్యాస్ వస్తుందన్న సమాచారం తెలుసుకున్న వినియోగదారులు కార్యాలయం వద్దకు చేరుకుని ఉదయం నుంచే క్యూలో బారులు తీరారు. ఒక్క లోడ్‌లో 500 సీలిండర్లు వచ్చాయి. ఇక్కడ 1500 మంది వినియోగదారులు వచ్చి బారులు తీరారు.
ఏజెన్సీ నిర్వాహకులు డోర్‌డెలీవరీ కోసం వాహనాల్లో భర్తీ చేసుకొని రూట్లలోకి వెళ్లినప్పటికీ ఎగబడ్డారు. గ్యాస్ తమకు దొరుకుతుందో లేదోనని వినియోగదారులు కార్యాలయం వద్ద, గోడౌన్ వద్ద క్యూలో బారులు తీరారు. బుకింగ్ చేసుకున్న వినియోగదారులందరికీ గ్యాస్ డోర్‌డెలివరీ సరఫరా చేస్తామని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నా నమ్మకం కుదరక ఎక్కువ మంది అక్కడికి చేరుకున్నారు. మోత్కూరు భారత్ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో మోత్కూరు, గుండాల, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు, తిర్మలగిరి, తుంగతుర్తి మండలాలున్నాయి. వీటి పరిధిలో 18 వేల కనెక్షన్లు ఉన్నాయి. ఏ రోజుకారోజు సరఫరా లేక పోవడంతో వినియోగదారులు సిలిండర్లతో వచ్చి బారులు తీరుతున్నారు. డిమాండ్ మేరకు సరఫరా చేయాలని కోరుతున్నారు.