న్యూఢిల్లీ: అఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కుదిరిన 48 గంటల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడు స్తూ అఫ్ఘనిస్థాన్‌పై పాక్ శుక్రవారం వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు స్థానిక క్రికెటర్లు సహా 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన అఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు త్వరలో పాకిస్థాన్, శ్రీలంకతో జరగనున్న ముక్కోణపు సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని పక్తికా ప్రావిన్సులోని జిల్లాలపై పాక్ వైమానిక దాడులకు దిగినట్టు అధికారులు తెలిపారు.
పాక్ దాడుల్లో మరణించిన ముగ్గురు క్రికెటర్లను కబీర్, సిబ్ఘహతుల్లా, హరూన్గా గుర్తించారు. వీరు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ కోసం ప్రొవిన్షియల్ రాజధాని అయిన షరానాకు వెళ్లి తిరిగి ఉర్గున్ జిల్లాలోని తమ ఇంటికి చేరుకోగా పాక్ దాడుల్లో మరణించారు. ఈ దాడుల్లో మరో ఐదుగురు మరణించారని, ఏడుగురు గాయపడ్డారని అఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. కాగా, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాక్ ముందుకొచ్చింది.