న్యూఢిల్లీ, అక్టోబర్ 18: కార్పొరేట్, టెక్ కంపెనీల్లో ఉద్యోగుల ఊచకోత ఈ ఏడాది కూడా కొనసాగుతున్నది. స్వతంత్ర తొలగింపుల ట్రాకర్ లేఆఫ్. ఎఫ్వైఐ ప్రకారం నిరుడు టెక్ కంపెనీలలో 1,50,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇప్పటివరకు ఈ ఏడాది టెక్ పరిశ్రమలో 90 వేల మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపారు. ఒక్క ఫిబ్రవరిలోనే 16,084 మందికి ఉద్వాసన పలికారు. టెక్ ఇండస్ట్రీలో ఏఐ, ఆటోమేషన్ ప్రభావం ఉద్యోగులపై తీవ్రంగా పడుతున్నది. వ్యయ నియంత్రణ, సంస్థల పునర్వ్యవస్థీకరణ పేరుతో సాధ్యమైనంత వరకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడంపై సంస్థలు దృష్టి సారించాయి. దీనికి టెక్ దిగ్గజం నుంచి స్టార్టప్ వరకు ఏ కంపెనీ మినహాయింపు కాదు. అన్ని రకాల కంపెనీలపై ఆవిష్కరణ ప్రభావం పడింది.
ప్రతి పరిశ్రమ ఏఐ, అటోమేషన్ జపం చేస్తున్నాయి. దీంతో మానవ వనరులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ట్రాకర్ లేఆఫ్.ఎఫ్వైఐ అందించిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరిలో టెక్ కంపెనీలు జనవరిలో 2,403, ఫిబ్రవరిలో 16,234, మార్చిలో 8,834, ఏప్రిల్లో 24,500, మేలో 10,397, జూన్లో 1606, జూలైలో 16,142, ఆగస్టులో 6,002, సెప్టెంబర్లో 2,205 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
క్విక్ కామర్స్ సంస్థ జెప్టో తాజాగా సుమారు 300 మంది ఉద్యోగులను తొలగించినట్టు ప్రకటించింది. తీవ్ర పోటీ వాతావరణంలో ఖర్చులను తగ్గించాలని సంస్థ భావిస్తోంది. జెప్టో స్థిర వ్యయాలను ఉద్యోగులపై నెలవారీ ప్రాతిపదికన తగ్గిస్తామని కంపెనీ ప్రకటించింది. అయితే కంపెనీ అదే ఉత్పాదకతను కొనసాగించనున్నట్టు తెలిపింది. గత ఏడాది 5 బిలియన్ డాలర్లు ఉన్న సంస్థ విలువను 7బిలియన్ డాలర్లకు పెంచింది. తొలగింపుల ప్రభావం ఆపరేషన్స్, టెక్, మేనేజ్మెంట్, ఫైనాన్స్ విభాగాల ఉద్యోగులపై ఎక్కువగా పడినట్టు ఒక అధికారి తెలిపారు. అయితే జెప్టో ఈ ఏడాది ప్రారంభం నుంచి వెయ్యి మంది వరకు ఉద్యోగులను ఇంటికి పంపినట్టు మరో అధికారి చెప్పారు.