జానపద నాటకం అంటేనే రాజుల కథలకు సంబంధించినది. అందులో యుద్ధాలు, కుట్రలు, కుతంత్రాలుంటాయి. పగలూ ప్రతీకారాలుంటాయి. కడకు ఉంపుడు గత్తెలను ఎరవేసి శత్రురాజులను లోబరుచుకునే పన్నాగాలూ నడుస్తాయి. అయితే ఈ ‘రాచక్రీనీడ’ల్లో సామాన్యులు సమిధలు కావడం పెను విషాదం. వీటన్నింటినీ రేఖామాత్రంగా చూపుతుంది ‘యుద్ధం – శాంతి’ నాటకం.
‘ఏ పెమ్మసాని తిమ్మభూపాలుని ఆధీనంలో గండికోట రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. కారణం ఆ రాజ్యంలోని ముచ్చుమర్రి ప్రాంతం అపారమైన వజ్రాల గని కావడమే! అక్కడి వజ్రం ఒకటి గోల్కొండ నవాబు కుతుబ్షాహీకి దక్కుతుంది. ఆ వజ్రం సోయగానికి నవాబు దాసుడైపోతాడు. ఎంతగా అంటే తను నిత్యం మెచ్చుకునే ప్రియురాలు, నర్తకి బిల్కిస్ నాట్యం కూడా కొరగాకుండా పోతుంది. నాటక ప్రారంభం ఈ సన్నివేశంతో మొదలవుతుంది. కొంతమంది పాలకులకు ‘స్త్రీ వ్యామోహం కన్నా వజ్రవైఢూర్య, సంపద వ్యామోహమే మిన్న’ అని తెలుస్తుంది. ముచ్చుమర్రి వజ్రాల గని దక్కించుకునేందుకు నవాబు లింగన్న పంతులు అనే కపటితో కలిసి పన్నాగం పన్నుతాడు. అభేద్యమైన ఆ వజ్రాల గనిని లింగన్న దూరం నుంచే నవాబు సైన్యాధికారి మీర్ జుమ్లాకి చూపుతాడు. దుస్సాహసంతో జుమ్లా తన సైనికులతో ఆ గనిపై దాడి చేస్తాడు.
ఆ గనిని రాజు తిమ్మ భూపాలుడి బావ నరసనాయకుని సంరక్షణలో ఉంటుంది. తిమ్మభూపాలుని సొంత చెల్లెలు గోవిందమ్మను నరసనాయకుడు వివాహమాడాడు. ఆయన దానిని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. పరాక్రమవంతుడైన నరసనాయకుని చేతిలో నవాబు సైన్యం చిత్తుగా ఓడిపోతుంది. సైనికాధికారి జుమ్లా చనిపోతాడు. లింగన్న పంతులు బంధీగా పట్టుబడి తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొంటాడు. నరసనాయకుడు ఉగ్రుడై నమ్మకద్రోహి లింగన్న పంతుల్ని సంసార సుఖానికి పనికిరాకుండా నిర్వీర్యుడిగా మారుస్తాడు. విచారణ సందర్భంగా రాజు క్షమాబిక్ష పొంది ‘బతుకు జీవుడా’ అంటూ బయటపడతాడు.

నరసనాయకుని మీద లింగన్న పంతులు పగబడతాడు. కుతుబ్షాను ఆశ్రయించి, ముచ్చుమర్రి వజ్రాలగని సొంతం కావాలంటే నరసనాయకుడు కాపలా ఉన్నంత వరకు సాధ్యం కాదని చెబుతాడు. అయితే నరసనాయకుడు స్త్రీ లోలుడని, ఆ బలహీనత ఆధారంగా చేసుకుని మీ ప్రియనర్తకి (ఉంపుడుగత్తె) బిల్కిస్ను ఎరగా వేస్తే లొంగదీసుకోవడం చాలా తేలికని సలహా ఇస్తాడు. నవాబు బిల్కిస్ను అందుకు ఒప్పిస్తాడు. బిల్కిస్ మాయా ప్రణయానికి నరసనాయకుడు దాసుడవుతాడు. ఆ మత్తులో జోగుతూ తన ధీరత్వాన్ని, బాధ్యతను మరిచిపోతాడు.
గోవిందమ్మతో అన్యోన్యంగా జీవించిన నరసనాయకుడు బిల్కిస్ వలలో చిక్కుకుంటాడు. ఇదే అదనుగా భావించి గోల్కొండ నవాబు గండికోట రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ వస్తుంటాడు. తన భర్త పతనోన్ముఖుడవటం అభిమానవతి అయిన గోవిందమ్మకు నచ్చదు. వీరనారిలా రంగంలోకి ఉరుకుతుంది. భూపాలుని సైన్యం అంచెలంచెలుగా పరాజయం పొందుతూ ఉంటుంది. లింగన్న పంతులు పతాక సన్నివేశంలో నరసనాయకుడికి తారసపడి ‘నా పగ, ప్రతీకారం గండికోట రాజ్య పతనానికి ఎలా కారణమైందో చూశావా?’ అని హేళన చేస్తాడు. ఈ దారుణాన్ని సహించలేక తిమ్మభూపాలుని పుత్రుడు చిరంజీవి పెమ్మసాని చంద్రశేఖరుడు లింగన్నను హతమారుస్తాడు.
యుద్ధంలో గోవిందమ్మ, నరసనాయకుడు, నవాబు సైనిక నేతలు నేలకొరుగుతారు. రణరంగం శవాల దిబ్బగా మారతుంది. రక్తపుటేరులు పారతాయి. ‘రణరంగం కానిచోటు భూస్థలమంతా వెతికినా దొరకదు. గతమంతా తడిసె రక్తముతో కాకుంటే కన్నీళ్లతో’ అన్న శ్రీశ్రీ మాటలు జ్ఞప్తికి వస్తాయి. వజ్రం కన్నా మానవ ప్రాణం విలువైనదని సంపద కోసం అశేష జనవాహిని ప్రాణాలను బలిగొనడం ఎవరికీ క్షేమం కాదని, శాంతిలోనే ప్రగతి – సౌభాగ్యం వర్ధిల్లుతాయని, తిమ్మభూపాలుడు నవాబుతో హితవచనాలు పలికి అతనిలో మార్పునకు కారకుడవుతాడు. అలా ఓటమిలోనూ విజయాన్ని చవిచూపి శాంతి బావుటాను ఎగురవేయడంతో నాటకం పరిసమాప్తమవుతుంది.

ఈ చారిత్రక పద్య నాటక ప్రదర్శనకు రెండు గంటల నిడివి గలది. దీనిని దాదాపు 30 మంది కళాకారులతో ఆంధ్ర నాటక కళా పరిషత్ ప్రదర్శించింది. సంస్థ 96వ వార్షికోత్సవం సందర్భంగా గతనెల 20, 21 తేదీలలో హైదరాబాద్లో అమీర్పేట కమ్మ సంఘంలో ఈ నాటక ప్రదర్శన నాటకాభిమానులను అలరించింది.
నాటకం పేరు : యుద్ధం – శాంతి
మూలకథ : కూచి రామాంజనేయులు
నాటక రచన : శారదా ప్రసన్న
నిర్మాత : బొల్లినేని కృష్ణయ్య
దర్శకత్వం : అన్నమనేని ప్రసాద్
ప్రదర్శన : ఆంధ్రనాటక కళా పరిషత్
పాత్రధారులు : నరేన్, మీర్, భుజంగరావు, మహేంద్ర శంకర్, విజయరాణి, రాజేశ్వరి, దేవసేన తదితరులు