BMW | మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (BMW) చిత్రానికి ఓటీటీ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పండగ సీజన్లో భారీ సినిమాల పోటీ కారణంగా ఈ చిత్రం ‘బిలో యావరేజ్’ టాక్‌తో సరిపెట్టుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ డేట్ విషయంలో చాలా కాలం నుండి సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. మొదటగా ఈ సినిమా ఫిబ్రవరి 13న ఓటీటీలో విడుదల కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల స్ట్రీమింగ్ వాయిదా పడింది.
ఆ తరువాత ఫిబ్రవరి 27, మార్చి 6 అంటూ పలు తేదీలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి డిజిటల్ హక్కులు దక్కించుకున్న జీ5 ప్లాట్‌ఫామ్ మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో రవితేజ అభిమానుల్లో మరోసారి ఉత్సాహం నెలకొంది. ప్రేమకథా చిత్రాలకు పేరున్న దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రవితేజ ఒక సంపన్న వ్యాపారవేత్త పాత్రలో కనిపించారు. వ్యాపార పనుల నిమిత్తం తరచుగా యూరప్‌కు వెళ్లే ఆయన, అక్కడ ఓ యువతితో పరిచయం పెంచుకుంటాడు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో అతని వైవాహిక జీవితంలో సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి.
ఆ భావోద్వేగ సంఘర్షణలను, కుటుంబ బంధాలను, సంబంధాల విలువను దర్శకుడు వినోదాత్మకంగా మేళవించి చూపించారు. కామెడీతో పాటు ఎమోషనల్ డ్రామా కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఈ చిత్రంలో ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరి పాత్రలు కథకు కీలకంగా నిలిచాయి. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో చూడాలని ఆసక్తిగా ఉన్నారు. రవితేజ మార్క్ కామెడీ, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో కూడిన ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై మంచి ఆదరణ పొందుతుందని మేకర్స్ భావిస్తున్నారు.