US-Israel Strikes : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ హత్యను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించారు. ఖమేనీ హత్య నిరంకుశ చర్యగా అభివర్ణించారు. ఈ మేరకు ఆదివారం పుతిన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
‘ఖమేనీ హత్య నిరంకుశమైంది. నైతిక విలువలు, అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించి హత్య చేశారు. ఖమేనీ కుటుంబానికి, ఆయన సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి. రష్యా ఎప్పుడూ ఖమేనీని గుర్తంచుకుంటుంది. ఆయన తన అద్భుతమైన పాలనతో ఇరుదేశాల మధ్య సంబంధాల పెంపునకు కృషి చేశారు’’ అంటూ పుతిన్ పేర్కొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌కు పుతిన్ తన సంతాప సందేశాన్ని పంపించారు. ఖమేనీ హత్యను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇజ్రాయెల్, అమెరికా దాడిపై మాత్రం పుతిన్ స్పందించలేదు. అయితే, ఈ చర్యలు ఈ ప్రాంతంలో తీవ్ర సంక్షోభానికి, సంఘర్షణకు దారి తీయొచ్చని, అణు యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని సీనియర్ రష్యా దౌత్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఐక్యరాజ్యసమితిలోని రష్యా ప్రతినిధి వాసిలీ నెబెన్జియా మాట్లాడుతూ ఖమేనీ హత్యను ఖండించారు. ఇది దౌత్యపరమైన చర్యలకు వెన్నుపోటులాంటిదని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాన్‌పై దాడులపై యూఏఈ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జాయెద్ స్పందించారు. ఈ పరిస్తితికి ఇరానే కారణమన్నారు. పొరుగు దేశాలతో యుద్ధం చేసే బదులు, తెలివితో ఆలోచించాలని ఇరాన్‌కు సూచించారు.