రఘునాథపాలెం, అక్టోబర్ 31: అక్టోబర్ మాసం ముగిసినప్పటికీ చెరువుల్లో ఉచిత చేపపిల్లలను పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముహూర్తం కుదరడం లేదు. హస్తం ప్రభుత్వంపై అపనమ్మకంతో గుత్తేదారులు ముందుకురాకపోవడంతో ఓ దఫా టెండర్ల ప్రక్రియ వాయిదా పడింది.. దీంతో మరోమారు గడువు ఇచ్చి టెండర్ల ప్రక్రియను ఎట్టకేలకు ముగించిన ప్రభుత్వం చేపపిల్లల పంపిణీని మాత్రం మరింత ఆలస్యం చేస్తోంది. ప్రతి ఏడాది ఏప్రిల్లో నిర్వహించాల్సిన టెండర్ల ప్రక్రియను ఆగస్టులో ప్రారంభించి అక్టోబర్లో ముగించడం గమనార్హం. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల్లో ఉచిత చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
చేపల వృత్తిపై ఆధారపడిన ముదిరాజ్, బెస్త కులస్తులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చి ఏడేళ్లు పకడ్బందీగా నిర్వహించింది. వివాదాస్పద చెరువులపై సైతం ప్రత్యేక జీవోను తీసుకొచ్చి మత్స్యకారులకు పూర్తిస్థాయిలో హక్కులను కల్పించింది. ఫలితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిఏటా అందించిన ఉచిత చేపపిల్లల పెంపకంతో మత్స్యకారులు ఆర్థిక పరిపుష్టిని సాధించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మత్స్యకారుల బతుకులు మళ్లీ వీధినపడ్డాయి. మొదటి ఏడాది ముక్కుతూ మూలుగుతూ చేపపిల్లలను పంపిణీ చేసిన ప్రభుత్వం ఈ ఏడాది మత్స్య కార్మికులను తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత చేపపిల్లల పంపిణీని నీరుగార్చే కుట్రలు చేస్తున్నది. భవిష్యత్తులో ఉచిత చేపపిల్లల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా చేపట్టడంతో ఉచిత చేపపిల్లల పంపిణీకి ఆలస్యమైంది. మరి ఆ ప్రక్రియ ముగిసి అగ్రిమెంట్ జరిగినా.. చేపపిల్లల పంపిణీని ప్రారంభించడానికి మంత్రులకు సమయం దొరకడం లేదు. ఇప్పటికే చెరువుల్లోకి చేరాల్సిన చేపపిల్లలు.. మంత్రుల తీరుతో మరింత అలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మత్స్య సహకార సంఘాల నాయకులు మంత్రులను కలిసి చేపపిల్లల పంపిణీకి సమయం కోరినా.. ఆ మంత్రిని పిలవండి, ఈ మంత్రిని పిలవండి అంటూ మరింత జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి వస్తేనే గానీ జిల్లాలో ఉచిత చేపపిల్లల పంపిణీకి మోక్షం లభించేట్లు లేదు. ఇప్పటికే వర్షాకాలం సీజన్ ముగియ వస్తోంది.
ఏ చెరువును చూసినా నిండుకుండలను తలపిస్తున్నాయి. కానీ ఉచిత చేపపిల్లలను మాత్రం ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. చెరువుల్లో చేపపిల్లలను వదలడం ఆలస్యం చేస్తే వదిలినా ప్రయోజనం ఉండదనేది మత్స్యకారుల ఆవేదన. కనీసం ఆరునెలల సమయం లేకుంటే చేప ఎదుగుదలకు ఆస్కారం ఉండదని, కనీసం చేప కిలో ఎదగకుంటే అమ్మేందుకు మత్స్యకారులు, కొనేందుకు జనం ఇష్టపడరని అంటున్నారు. నానాటికీ చేపపిల్లల పంపిణీని ఆలస్యం చేయడం వల్ల మత్స్యకారులకు సమస్యలు తలెత్తడమే తప్ప ప్రయోజనం ఉండదనే విమర్శలు మత్స్య సహకార సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.