ఖమ్మం, అక్టోబర్ 31: ఖమ్మంలో మున్నేరు శాంతించింది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం ఉదయం 22 అడుగుల వద్ద ఉన్న మున్నేరు ప్రవాహం క్రమంగా తగ్గుతూ సాయంత్రం 15 అడుగులకు చేరింది. రెండు రోజులుగా పునరావాస కేంద్రాల్లో ఉన్న ముంపు ప్రాంతాల ప్రజలు శుక్రవారం వరద తగ్గుతుండడంతో తమ ఇళ్లకు చేరుకున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపాదికన పారిశుధ్య పనులను చేపట్టారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ ఎప్పటికప్పుడు వరద ఉధృతిని సమీక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
మున్నేరు పరీవాహక ప్రాంతాలైన మోతీనగర్, బొక్కలగడ్డ, కాల్వొడ్డు, వెంకటేశ్వరనగర్, సమ్మక్క సారక్క ఆర్చీ రోడ్, మంచికంటినగర్, ధంసలాపురం ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు రోడ్లను శుభ్రం చేశారు. ముంపునకు గురైన నివాసాలకు తాగునీటి సరఫరా, విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు ఆధ్వర్యంలో ముంపు బాధితులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.