భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పిలుపునిచ్చారు. సర్దార్ 150 ఐక్యత పాదయాత్ర కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ భద్రాద్రి కలెక్టరేట్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ సంస్థ సమన్వయంతో దేశవ్యాప్తంగా సర్దార్ 150 ఐక్యత మార్చ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. జిల్లాస్థాయిలో నవంబర్ ఒకటో తేదీ నుంచి మూడు రోజులపాటు ఐక్యత పాదయాత్రలు, ఆరోగ్య శిబిరాలు, పటేల్ జీవితం చరిత్రపై ప్రసంగాలు, ఆత్మ నిర్భర్ భారత్ ప్రతిజ్ఞలు, సర్టిఫికెట్ ప్రదానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. నవంబర్ 6 నుంచి రెండో విడత శిక్షణ ఉంటుందన్నారు. అనంతరం ఐక్యతా ర్యాలీ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, డీఎస్డీవో పరంధామరెడ్డి పాల్గొన్నారు.