మధిర, అక్టోబర్ 31: ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెం దిన సీపీఎం నాయకుడు, రాష్ట్ర రైతు సంఘం మాజీ అధ్యక్షుడు సామినేని రామారావు(70)ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. రామారావు సీపీఎంలో చురుగ్గా ఉంటూ పాతర్లపాడులో వ్యవసాయం చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నారు. ప్రతిరోజు లాగే శుక్రవారం తెల్లవారుజామున వాకింగ్ వెళ్లి తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటిపకనే ఉన్న కొట్టంలో రెండు గంపల్లో కప్పి ఉంచిన పెంపుడు కోళ్లను విడిచి పెట్టేందుకు వెళ్లాడు. ఈక్రమంలో అకడే మాటువేసి ఉన్న గుర్తు తెలియని దుండగులు ఆయనపై కత్తులతో దాడి చేసి ఛాతిపై విచక్షణారహితంగా పొడిచారు. ఆయన అరుపులు విన్న భార్య స్వరాజ్యం వ చ్చి చూసి కేకలు వేసింది. దీంతో దుండగులు వెనుక భాగం నుంచి పరారయ్యారు.
అప్పటికే రామారావు తీవ్ర రక్తస్రావంతో కిందపడి ప్రాణాలు విడిచారు. పాతర్లపాడు గ్రామంలో 43 ఏండ్ల క్రితం సీపీఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ హత్యలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు సీపీఎం నేత సామినేని రామారావు హత్యతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హత్య విషయం తెలుసుకున్న ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ ఘటనాస్థలానికి చేరుకొని రామారావు మృతదేహాన్ని పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ గూండాలను కఠినంగా శిక్షించాలి : సీపీఎం
రామారావును కాంగ్రెస్ గూండాలే హత్య చేశారని, హంతకులను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం పాతర్లపాడు గ్రామానికి చేరుకున్న సీపీఎం నాయకుల బృందం రామారావు మృతదేహాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా మీడియాతో పోతినేని మాట్లాడుతూ గత దసరా పండుగ రోజు సీపీఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన చిన్న ఘర్షణ పోలీస్ కేసుల వరకు వెళ్లిందని, దాన్ని మనసులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ గూండాలే రామారావును అతి కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. రామారావును హత్య చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక తమకు అడ్డు ఉండదని కుట్ర చేసినట్లు ఆరోపించారు. ఈ హత్యకు డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన భర్త రామారావును ఆరుగురు వ్యక్తులు కలిసి కత్తులతో దాడి చేసి హత్య చేశారని ఆయన భార్య స్వరాజ్యం చింతకాని పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు.
రామారావు హత్యకు బీఆర్ఎస్ ఖండన
సామినేని రామారావు హత్యను బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామారావు హత్య ఖమ్మం జిల్లాలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు అద్దం పడుతుందన్నారు. కోల్పోతున్న ఉనికి కోసం హత్యా రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.