నర్సాపూర్, అక్టోబర్ 31 : నర్సాపూర్ అటవీ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ అర్బన్ పార్కు నిర్మాణం చేపట్టారు. ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని ఈ పార్కులో మొక్కనాటి కేసీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం, నర్సాపూర్ అర్బన్ పార్కుకు పర్యాటకుల తాకిడి పెరగటంతో పర్యాటకుల సౌకర్యార్ధం 2021లో అటవీ శాఖ ఆధ్వర్యంలో కాటేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 3 కోట్లు విడుదల చేసింది.
ఈ నిధులతో ఏడు కాటేజీలు, రిసెప్షన్ సెంటర్, స్విమ్మింగ్‌పూల్ నిర్మాణాలు పూర్తిచేశారు. 40 కాటేజీలను శనివారం మంత్రులు కొండా సురేఖ, వివేక్, దామోదర రాజనర్సింహ ప్రారంభిస్తారని అటవీ అధికారులు శుక్రవారం తెలిపారు. ఓవైపు కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని అంటూనే మరోవైపు కేసీఆర్ కట్టించిన నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు చేయడమేమిటని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను బీఆర్ఎస్ నాయకులతో పాటు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.