హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంకేతిక విద్యామండలి(ఎస్బీటెట్) రద్దుకానున్నదా..? ఏడు దశాబ్దాలుగా సేవలందించిన బోర్డు కాలగర్భంలో కలువనున్నదా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తున్నది. ఈ బోర్డును రద్దుచేయాలని తెలంగాణ విద్యా కమిషన్ సర్కార్కు సిఫార్సు చేసింది. బోర్డు అధికారాలు, విధులను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలకు అప్పగించాలని సూచించింది. బోర్డు రద్దు అంశం సాంకేతిక విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవడం, నియంత్రించడం కోసం 1957లో సాంకేతిక విద్యామండలిని నెలకొల్పారు. డిప్లొమా లెవల్లో సాంకేతిక విద్య, పరీక్షల నిర్వహణ, విద్యాప్రమాణాల పెంపు వంటివి లక్ష్యంగా ఈ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే విద్యాకమిషన్ సర్కార్కు సిఫార్సు చేయడంతో ఈ బోర్డు రద్దు దిశగా అడుగులు పడ్డట్టేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల జోరు నడుస్తున్నది. సీట్ల ఎంపిక విషయంలో విద్యార్థులు సర్కార్ కాలేజీలకే జై కొడుతున్నారు. రాష్ట్రంలో 128 పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి. వీటిలో 59 ప్రభుత్వ పాలిటెక్నిక్లు కాగా 67 ప్రైవేట్, రెండు ఎయిడెడ్ కాలేజీలు. అయితే సీట్ల భర్తీని పరిశీలిస్తే 2025-26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోనే ఎక్కువ సీట్లు నిండాయి. వీటిల్లో 14,322 సీట్లుండగా, 11,267 సీట్లు నిండాయి. అదే ప్రైవేట్ కాలేజీలో 14,640 సీట్లకు 8,464 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రభుత్వ కాలేజీల్లో 21% సీట్లు మాత్రమే ఖాళీగా ఉండగా, అదే ప్రైవేట్లో 42% సీట్లు ఖాళీగా ఉన్నాయి.