హైదరాబాద్ సిటీబ్యూరో/వెంగళరావునగర్, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): ఒకవైపు జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఎన్నికల హడావుడి నడుస్తుంటే.. మరోవైపు అదే నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad) నగరం నడిబొడ్డున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక రౌడీషీటర్లు ఉన్న బోరబండ (Borabanda) ప్రాంతంలో శుక్రవారం జరిగిన సంఘటన కలకలం రేపింది. ఈఎస్ఐ (ESI) సమీపంలోని ఎర్రగడ్డ ఫుట్ఓవర్ బ్రిడ్జిపై తెల్లవారుజామున 4 గంటల సమయంలో విధులకు వెళ్తున్న యాభై ఏండ్ల బల్డియా పారిశుద్ధ్య కార్మికురాలిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఏజీకాలనీ వైపు పారిశుద్ధ్య విధులు నిర్వర్తించేందుకు బాధితురాలు నడుచుకుంటూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌పైకి వెళ్లింది. మద్యం మత్తులో ఉన్న నంబూరి రాజు అనే వ్యక్తి ఆమెను బ్రిడ్జిపైనే అడ్డగించి బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మాడల్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పాసింగ్ హైవేపై అఘాయిత్యమా!
ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సమయంలోనే ఓ దళిత మహిళపై లైంగికదాడి జరగడం నియోజకవర్గవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన రేవంత్‌రెడ్డి పాలనావైఫల్యానికి అద్దంపడుతున్నదని స్థానికులు విమర్శిస్తున్నారు. ముంబై హైవేపై నిరంతరం వాహనాల రాకపోకలు కొనసాగే ప్రాంతంలో దాదాపు అందరూ రోడ్డు క్రాస్ చేయడానికి ఉపయోగించే ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్‌పై ఈ ఘటన జరగడానికి పోలీసు గస్తీ లేకపోవడమే కారణమని చర్చించుకుంటున్నారు. తెల్లవారుజామున ఘటన జరిగే సమయంలో అక్కడ ఎవరూ లేరా? ఉంటే ఎందుకు అడ్డుకోలేదు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. బాధితురాలి నివాసం ఘటనా స్థలికి సమీప ప్రాంతంలోనే ఉండటంతో ఆమె డ్యూటీకి వెళ్లే సమయం తెలిసే నిందితుడు ఫాలో చేస్తూ వచ్చాడా? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు తనను పట్టుకునే సమయంలో అధికార పార్టీకి చెందిన చోటామోటా నేతల పేర్లు చెప్పినట్టు సమాచారం.