హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 31 : జూబ్లీహిల్స్‌లో రోజురోజుకూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ అనుచరుల దాడులు పేట్రేగిపోతున్నాయి. రెండ్రోజుల కిత్రం నవీన్ యాదవ్ మీడియా ముఖంగా ‘ఇంటి నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు మళ్లీ ఇల్లు సూడరు.. జూబ్లీహిల్స్ నా అడ్డా’ అంటూ వ్యాఖ్యానించారు. మరుసటి రోజే నవీన్ అనుచరులు తమ పని మొదలు పెట్టారు. గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ గూండాలతో వచ్చి ప్రచారాన్ని అడ్డుకున్నారు. ‘మళ్లీ ఇక్కడ తిరిగితే ఊరోకోం’ అంటూ ఊగిపోయారు. ఇది మరవక మందే బోరబండలో ఎన్నికల ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై నవీన్ యాదవ్ అనుచరులు మరోసారి దాడికి పాల్పడారు.
బిడ్డా.. ఖతం చేస్తం
బోరబండలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు అక్కడే నవీన్ యాదవ్ అనుచరులు కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తిని అపి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని నవీన్ అనుచరులు ఆ వ్యక్తిని అడిగారు. బీఆర్ఎస్ హయాంలో అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేశారో చెప్పాలని ఆ వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో ఏం చెప్పాలో పాలుపోక ఓటరు అని కూడా చూడకుండా అతడితో పాటు అక్కడున్న బీఆర్ఎస్ నాయకులపై నవీన్ యాదవ్ అనుచరులు దాడికి దిగారు. ‘ఆరేయ్..మీ బీఆర్ఎసోళ్లను బోరబండలో తిరగనివ్వం.. బిడ్డా ఖతం చేస్తం’ అంటూ బెదిరించారు. అక్కడున్న పెద్దలు కలగజేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. తాత్కాలింగా గొడవ సద్దుమణిగినా నవీన్‌యాదవ్ అనుచరులు ఎప్పుడు ఎక్కడ దాచి చేస్తారోనని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. నవీన్ యాదవ్ అనుచరులు వరుసగా బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగుతుండటంతో ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక గూండాల రాజ్యంలో ఉన్నామా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ‘ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక నవీన్ యాదవ్ గెలిస్తే మా పరిస్థితి ఏంది? జూబ్లీహిల్స్ ప్రజలకు రక్షణ ఉంటుందా?’ అని చర్చించుకుంటున్నారు.