మామిళ్లగూడెం, అక్టోబర్ 31: జాతీయ సమైక్యత, సామరస్యం, దేశభక్తి, సమష్టిభావం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే తమ శాఖ లక్ష్యమని సీపీ సునీల్‌దత్ పేర్కొన్నారు. భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవ పరుగును శుక్రవారం ఖమ్మంలో నిర్వహించారు.
ముందుగా జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం సీపీ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. దేశాన్ని ఏకబంధంతో కట్టిపడేసిన పటేల్ న్యాయకత్వం ప్రతి ఒక్కరికీ ప్రేరణ అని గుర్తుచేశారు. పోలీసు అధికారులు ప్రసాద్‌రావు, రామానుజం, కుమారస్వామి, విజయబాబు, రమణమూర్తి, సుశీల్‌సింగ్, నర్సయ్య, డాక్టర్ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.