సిటీబ్యూరో/దుండిగల్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో విలీనమైన పురపాలికల్లో అక్రమ నిర్మాణాల పర్వం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇంటి అనుమతి తీసుకుని ..ఏకంగా భారీ వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నా.. అడిగే నాథుడే కరువయ్యారు..అధికారుల బదిలీల గందరగోళాన్ని అసరాగా చేసుకుంటున్న కొందరు బిల్డర్లు, రాజకీయ నేతలు సిండికేట్‌గా మారి టౌన్ ప్లానింగ్ విభాగంలో కొందరు అధికారుల ప్రోత్సాహంతో అడ్డగోలుగా నిర్మాణాలు సాగిస్తున్నారు.
నివాస అవసరాల కోసం అనుమతి తీసుకుని బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పెడుతున్నారు. నిబంధనల ప్రకారం పునాది స్థాయిలోనే అడ్డుకోవాల్సిన యంత్రాంగం.. నిర్మాణం పూర్తయ్యాక నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. విలీన పురపాలికల్లో భాగంగా నిజాంపేట, నార్సింగి మున్సిపాలిటీల్లో ఈ అక్రమ నిర్మాణాల జోరు కొనసాగగా, తాజాగా దుండిగల్‌లో అక్రమ నిర్మాణాలు వందల సంఖ్యలో జరుగుతున్నా.. టౌన్ ప్లానింగ్ విభాగం చర్యలు తీసుకోకపోవడం…బిల్డర్లతో టౌన్ ప్ల్లానింగ్ అధికారులు, సిబ్బంది కుమ్మక్కైనట్లు ఇటీవల జరిగిన ఏసీబీ దాడులే తేటతెల్లం చేశాయి. ఈ క్రమంలోనే లహరీ గ్రీన్ పార్కు వెంచర్లో ఓ బిల్డర్ సుమారు 1000 గజాల్లో నిర్మిస్తున్న అక్రమ సెల్లార్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
బహిరంగ రహస్యమే..
బౌరంపేట్లోని లహరిగ్రీన్ పార్క్(బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీ నుంచి బాచుపల్లి వీఎన్ఆర్ కళాశాలకు వెళ్లే రోడ్డు), ప్ల్లాట్ నంబర్ 182, సర్వేనంబర్ 541, 542, 544, 545, 547, 548, 554, 555, 560లోని 835.91 స్కేర్ మీటర్లు (998.91 గజాలు) విస్తీర్ణంలో రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి బిల్డ్ నౌ ద్వారా గత ఏడాది సెప్టెంబర్ 26న దుండిగల్ మున్సిపల్ అధికారులు స్టిల్ట్ +5 అంతస్తులకు అనుమతులు జారీ చేశారు. సదరు నిర్మాణదారుడు మాత్రం మొదట్లోనే మున్సిపల్ అనుమతులకు విరుద్ధంగా భారీ సెల్లార్ తవ్వి ఇటీవలే సెల్లార్ నిర్మించాడు. ఈ విషయంలో బిల్డర్ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని స్థానికులు మున్సిపల్ అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా అటువైపు ఎవరూ కన్నెత్తి చూడలేదు. పైగా సదరు భవన నిర్మాణానికి తాము అనుమతులు ఇవ్వలేదని, హెచ్ఎండీఏ అనుమతులు ఉన్నాయంటూ ఫిర్యాదుదారులను ‘బురిడీ’కొట్టించారు. తీరా ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తామనడంతో ఎట్టకేలకు అనుమతుల పత్రాలు బహిర్గతమయ్యాయి .
ఈ లోగా నిర్మాణదారుడు సెల్లార్ పనులను పూర్తిచేసుకుని స్టిల్ట్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యాడు. ఇదేమని అధికారులను ప్రశ్నిస్తే పెద్దల ఒత్తిడి ఉందంటూ మరోసారి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే.. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అనుమతుల నిబంధనలోనే ఎటువంటి డీవియోషన్ జరిగినా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఎందుకు మిన్నకుంటున్నారనేది బహిరంగ రహస్యమేనని స్థానికులు చెబుతున్నారు.
అనుమతులపైనే పలు అనుమానాలు..
నిర్మాణదారుడు బిల్డ్ నౌ ద్వారా అనుమతులు పొందే అవకాశం ఉన్నప్పటికీ కొంత స్థలాన్ని మార్ట్గేజ్ చేయాల్సి ఉండటంతో పాటు పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఫీజలు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని తప్పించుకునేందుకే బిల్డర్ దుండిగల్ మున్సిపల్ అధికారులను ప్రసన్నం చేసుకున్న నిర్మాణదారుడు స్టిల్ట్+5 అంతస్తులకు అనుమతులు పొంది ఆదిలోనే ఉల్లంఘనకు పాల్పడుతున్నా కండ్లుండి చూడలేని దుస్థితిలో అధికారులు ఉన్నారని పలువురు పేర్కొంటున్నారు. పైగా మున్సిపల్ అధికారుల అనుమతులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణదారుడు దరఖాస్తు చేసుకున్న నెలరోజుల్లోపే మంజూరు కావడం ఒక ఎత్తయితే, దుండిగల్ మున్సిపాలిటీ నుంచి జీహెచ్ఎంసీలో వీలినమవుతున్న తరుణంలో చకచకా అనుమతులు రావడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగర శివారు మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమవుతున్న తరుణంలో రాత్రికిరాత్రే ఇటువంటి ఫైళ్లను క్లియర్ చేశారనే ఆరోపణలున్నాయి.
ఏసీబీ తనిఖీల్లో బట్టబయలు
టౌన్ ప్లానింగ్‌లో చోటు చేసుకుంటున్న అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఏసీబీ సిటీ రేంజ్-2 యూనిట్ ఈనెల 18న దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో రోజంతా తనిఖీలు నిర్వహించింది. రికార్డులు స్వాధీనం చేసుకుని పరిశీలించగా జీ+3 అంతస్థుల భవనాలకు అక్రమంగా జీ+5 అంతస్థుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడాన్ని గుర్తించారు. వందల సంఖ్యలో అక్రమ భవనాలు ఉండగా ఒకటి, రెండింటిని మాత్రమే సీజ్ చేయాడాన్ని గుర్తించారు.ఈ వ్యవహారంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ వాట్సాప్ చాట్ల ద్వారా పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడి, వచ్చిన సొమ్మును తన భర్త సంస్థకు అనధికారిక లావాదేవీలు నడిపినట్లు తేల్చారు. అవినీతి, అక్రమాల్లో అధికారులు ఆరితేరినట సర్వత్రా విమర్శలు వ్యక్తంఅవుతున్నాయి. ఈ నేపథ్యంలో బౌరంపేట్‌లో జరుగుతున్న అక్రమ భవణ నిర్మాణాలపైనా మరోసారి అధికారులు విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.