మేడ్చల్, ఆగస్టు6(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చిన విషయం విధితమే. ప్రభుత్వ నిబంధనల మేరకు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చిన ప్రైవేట్ ఆస్తులపై నిషేధిత జాబితాలో చేర్చడంతో క్రయ, విక్రయాలకు సబ్ రిజిస్ట్రార్లు ఎన్ఓసీలు తీసుకువస్తే తప్ప రిజిస్ట్రేషన్లను చేయకపోవడంతో బాధితులు ఎన్ఓసీల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. కాగా, జిల్లాలో ఎన్ఓసీల కోసం వేలల్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు.
తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఆర్డీవో, జిల్లా కలెక్టరేట్‌కు వచ్చి దరఖాస్తులు చేస్తున్నారు. అయితే నిషేధిత జాబితాలో పొరపాటున పడ్డ ప్రైవేట్ ఆస్తులకు నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ఎన్ఓసీలు ఇస్తామని అధికారులు పేర్కొంటున్నప్పటికీ తహసీల్దార్ నివేదిక ఆధారంగా మాత్రమే ఎన్ఓసీలు అధికారులు ఇస్తామంటున్నారు. ప్రసు త్తం వచ్చిన దరఖాస్తులను మాత్రం 45 రోజుల్లో పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నా.. ఆచరణలో అమలు జరిగే అవకాశం ఉందా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
దరఖాస్తు ఆధారంగా ప్రైవేట్ ఆస్తులను రెవెన్యూ ఇన్స్పెక్టర్ సర్వే అనంతరం తహసీల్దార్ నివేదికను తయారు చేసిపై అధికారులకు ఆన్లైన్లో పంపిస్తారు. అయితే వేలల్లో వచ్చిన దరఖాస్తుదారుల పైవేట్ ఆస్తుల సర్వే చేయాలంటే తగినంత రెవెన్యూ సిబ్బంది లేరు. మరి వచ్చిన దరఖాస్తులకు సర్వే చేయాలంటే కష్టతరంగా మారింది. దీంతో ఎన్ఓసీల జారీలో మాత్రం తీవ్ర ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అత్యవసరంగా ఉన్నందునే తమ ఆస్తులను అమ్ముకుంటున్నామని, దీనికి మళ్లీ ఎన్ఓసీల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోతున్నారు. ప్రైవేట్ ఆస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం హక్కు ఉందని నిషేధిత జాబితా చేర్చిందని ప్రశ్నిస్తున్నారు. పైసా పైసా కూడగట్టుకుని ఆస్తులు కొనుక్కుంటే ఇప్పుడు ఎన్ఓసీల పేరిట ఇబ్బందులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తక్షణమే ఎన్ఓసీలు ఇచ్చే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు.