– ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్
భద్రాచలం, అక్టోబరు 06 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్ డిమాండ్ చేశారు. మంగళవారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఏఈవో శ్రావణ్‌కుమార్, ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబాలు దేవస్థానం తరపున తీర్ధప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గర్భగుడి మినహా మిగతా నిర్మాణాలు తొలగింపు చేశారని తెలిపారు. అయితే, ఈ పనులకు సంబంధించి ఏ స్థాయి ప్రణాళికలు మ్యాపింగ్ ఉన్నాయి? ఎంత బడ్జెట్ కేటాయించారు? ఏ కాల పరిమితిలోగా పూర్తి చేస్తారు? అనే వివరాలను అధికారులు, ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యులైన అధికారుల వివరాలు గానీ, పనుల పురోగతి సమాచారం గానీ అందుబాటులో లేకపోవడం సరికాదన్నారు.
యాదాద్రి తర్వాత రాష్ర్టంలోనే అత్యంత కీలకమైన దేవస్థానమైన భద్రాచలంలో నిర్మాణాలు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉండకూడదని, వర్షాకాలంలో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. కాబట్టి, కాలయాపన చేయకుండా అత్యంత వేగంగా, నిబద్ధతతో పునర్నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు సకల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పనులు సకాలంలో నెరవేరేలా సంబంధిత శాఖలు, కాంట్రాక్టర్లు, ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పూర్తి బాధ్యత వహించాలని కోరారు. ఆయన వెంట భద్రాచలం బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ, కోటగిరి ప్రబోద్‌కుమార్, గోసుల శ్రీను, రావులపల్లి పృద్వీ, కావూరి సీతామహాలక్ష్మి, గోళ్ల గణేష్, గొట్టిముక్కల సాయిబాబా ఉన్నారు.

‘భధ్రాచలం ఆలయ పునర్నిర్మాణ నమూనా, బడ్జెట్ వివరాలను బహిర్గతం చేయాలి’
ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్ భద్రాచలంలో వేకువజామున మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ వెళ్లి ఆలయ నిర్మాణ పనులను, ఆలయ సమీపంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. రామ భక్తులు సంచరించే ప్రాంతాల్లో కనీస పారిశుధ్య పనులు చేపట్టడంలో గ్రామ పంచాయతీ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. ఆలయం చుట్టు పక్కల చెత్త చెదారం పేరుకుపోవడంతో కళావిహీనంగా తయారైందని ఆరోపించారు. వెంటనే జిల్లా పంచాయతీ అధికారులు ముమ్మర పారిశుధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.